మన రాజ్యాంగ నిర్మాణం ప్రకారం ఒక రాజకీయ పార్టీ మనుగడకు మరే ఇతర విషయాలకన్నా ప్రజాదరణే కీలకాంశం. ఇటువంటి నిర్మాణంలో నేతల నిబద్దతే రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. మన దేశ ప్రజలలో అత్యధికులు నిరక్షరాస్యులు. అక్షరఙ్ఞానం ఉన్నా రాజకీయ చైతన్యం లేనివారు. అమాయకులు. మన నాయకులు మొదట్లో ప్రజాదరణ కోసం మంచి మార్గాలనే అనుసరించినా క్రమంగా ప్రజల అనేక బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని మరింత బలహీనపరుస్తూ వారిని ఎటువంటి అన్యాయమైనా సహించేలా, ఉదాసీనత వహించేలా మార్చేసారు. గతంలో ప్రజలు తనకు ఎరుకలో వున్నవారికి అన్యాయం జరిగేంతవరకు సహించేవారు, కాని ప్రస్తుతం తనదాకా వచ్చినా తేల్చుకోలేని స్థితిలో వున్నారు. ప్రజలను ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని సందిగ్దావస్థలోకి నెట్టేసారు. ప్రజలు ఈ సందిగ్దావస్థలో వుండగానే మరో కొన్ని దశాబ్దాలపాటు నిరాటంకంగా దోచుకుంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో స్థాపించబడిన లొక్ సత్తా లాంటి పార్టీలు సిద్దాంతపరంగా దేశంలోని యువకులను ఊరించినా కార్యశీలత పరంగా ఇతర పార్టీలను ఎదుర్కొనే స్థాయిలో లేదన్నది నిరాశ పరిచే వాస్తవం. దీనికి అసలు కారణం సుషుప్త/సందిగ్ధావస్తలో ఉన్న ప్రజలను తగిన మోతాదులో ఆకర్షించక పోవటమే. ఏ కొద్దిమందికో(కాని నిర్ణాయక శక్తి ఇదే) తప్ప మన దేశం/రాష్ట్రం లోని అత్యధిక శాతం ప్రజలకు రాజకీయ విధానాలను అర్థం చేసుకుని నేతలనెన్నుకునేంత పరిణితిలేదన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మెజారిటీ ప్రజలు తమ పరిధిలోని స్వల్పకాలిక ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. స్వాభావికంగా నిర్ణాయక శక్తిని సిద్దాంత నిబద్దత కలిగిన పార్టీలు ఆకర్షించగలిగినా ప్రాధాన్య వోటును సంపాదించటానికి సిద్దాంతాలు సరిపోవు. రాజనీతిని ప్రదర్శించగలగాలి. రాజకీయ నిర్ణయాలను అమలుపరచగల కార్యసాధకులను ఆకర్షించడమో పెంపొందించడమో చేయాలి.
ప్రజారాజ్యం లాంటివి చేస్తున్న పని ఇదే. వారికి సిద్దాంతాలమీద అవగాహన లేదు. కాని ప్రజాకర్షణతో ప్రాధాన్య వోటును సులభంగా పొందుతారు. కార్య సాధకులనూ ఆకర్షిస్తున్నారు. వీరికి నిర్ణాయక శక్తిని ఆకర్షించే సిద్దాంతాలు లేకపోవడం పెద్ద లోటు. అయినప్పటికీ కొత్త పార్టీ కనుక, మరో మెరుగైన ప్రత్యామ్న్యాయం లేదు కనక కొంత నిర్ణయాత్మక వోట్లు వీరికి పడే సంభావ్యత వుంది. బహుముఖ పోటీలో అధికారాన్నీ సాధించవచ్చు. అధికార సాధన తరువాత ఇటువంటి పార్టీ నేతలు ప్రదర్సించే నిబద్దతను బట్టి అవి ప్రత్యేకతను సంతరించుకోవడమో లేక మరో మూస పార్టీగానో మిగిలిపోతుంది. చరిత్రను గమనిస్తే ఎందరో ఉత్తమ నాయకుల అధికార సాధనాపర్వంలో విలక్షణత దుర్లక్షణాలుగా రూపంతరం చెందడం అనుభవమే.
దేశ ప్రగతికి సిద్దంతాలు, నిబద్దత ముఖ్యమైనా అధికార సాధనకు కీలకాంశం ప్రజాకర్షణ. ప్రజాస్వామ్యంలో ప్రజలకంటే విలువైనది ఆ ప్రజలిచ్చే అధికారం. సిద్దాంత నిబద్దత కలిగిన నాయకులు రాజకీయ పరిణితిని ప్రదర్శించి దేశానికి నష్టం కలిగించని ప్రజాకర్షక నిర్ణయాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో మేధావులైన యువకులకు లోటులేదు. కళాశాల స్థాయిలో రాజకీయాలపై చర్చను లేవదీస్తే మన దేశమెదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొండం అసాధ్యమేమీ కాదు. ప్రజలను ఆకర్షించటంలో చతురతను విధానాల ప్రకటనలో నిబద్దతను చూపిస్తే ఉత్తమ రాజ్యంగా ఎదగడం కష్ట సాధ్యమే.
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
ఇప్పటివరకూ ఈ టపాకు రాని కామెంట్లుకూడా ప్రస్తుత పరిస్థితికి ఉదాహరణలే!
మన భారతీయులు స్వతహాగా ఏమోషనల్ గా రియాక్టవుతామేగానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోము. అంటే సిద్దాంతంకన్నా,సెంటిమెంట్ మిన్నన్నమాట!
అసలు పార్టీ సిద్దాంతాలు చెప్పమంటున్న చిరంజీవికి బ్రహ్మరధం పడుతున్న మనం,భారతరాజకీయ చరిత్రనే తిరగరాయగలిగిన బలమైన సిద్దాంతాలు కలిగిన జేపీ ని మాత్రం పక్కనపెడుతున్నాం.
కారణాలు ఏవైనా అది మన దురదృష్టం అని మాత్రం అనుకోవచ్చు. కానీ మార్పురావాలి.మనమే ఆ మార్పుతేవాలి. లోక్ సత్తాలో చేరుదామనే నిర్ణయానికి నేనైతే వచ్చేసాను. పడేది నా ఒక్కడి ఓటైనా నా తృప్తికోసం నేను జేపీ కే ఓటేస్తాను.
కడివెడైననేమి ఖరము పాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. ఒక్క కమెంటైనా...చాలు. మన ప్రజలు అలవాటు ప్రకారం నిశ్శబ్దంగా చదువుతున్నారనే అనుకుందాం. జెపి గారికే వుద్దేశించిన టపా ఇది. నా వోటు కూడా ఆయనకే.
మరిచాను, ధన్యవాదాలు మహేష్ గారూ..
లొక్ సత్తా లాంటి పార్టీలు సిద్దాంతపరంగా దేశంలోని యువకులను ఊరించినా కార్యశీలత పరంగా ఇతర పార్టీలను ఎదుర్కొనే స్థాయిలో లేదన్నది నిరాశ పరిచే వాస్తవం. దీనికి అసలు కారణం సుషుప్త/సందిగ్ధావస్తలో ఉన్న ప్రజలను తగిన మోతాదులో ఆకర్షించక పోవటమే.
--- నాకు నాపక్కింటాయనకూ లోక్ సత్తా గురించి తెలియజెప్పకపోవటం ఎవరిది తప్పు?ఆర్ధికంగా మిగతావాళ్ళతో తూగలేకపోవచ్చు,కానీ ఉన్న మానవవనరులను(కార్యకర్తలు,అభిమానులు,సానుభూతిపరులూ)ఇలాంటి
వనరులను ఎందుకు ఉపయోగించుకుని ప్రజాబాహుళ్యం లో ప్రాచుర్యం ఎందుకు పొందగూడదు?మంచి సిద్ధాంతాలు,మంచి కార్యకర్తలు,మంచి కార్యాచరణప్రణాళికలు...వీటితో పాటు ఇక్కడో మంచి రాజకీయప్రత్యామ్నాయ పార్టీ ఉంది అని జనానికి తెలియాలి,కానీ ఆ ప్రయత్నం ఇంతవరకూ లోక్ సత్తా పూర్తి స్థాయిలో చేపట్టలేదు.కారణాలు తెలియదు నాకైతే.
రాజేంద్ర కుమార్ గారూ, మీరన్నది నిజమే. లోక్ సత్తాలో తగినంత సత్తా లేకపోవడమే దీనికి మూలం. మేధావులతో వచ్చిన చిక్కే ఇదంతా. వారి సిద్దంతాలను ఒక పద్దతి ప్రకారం నడిపించాలని చూస్తారు. మార్గాంతరాలను అన్వేషించే చొరవ కాస్త తక్కువగానే వుంటుంది. కాని తన ఆశయ సాధన కోసం పదవులను వదులుకొని వచ్చినతను అధికార సాధనకు అవసరమైనంత రాజకీయ పరిణితి చూపించక పోవటం కొంచం అసంతృప్తి గానే వుంది.
@రాజేంద్ర గారు
"--- నాకు నాపక్కింటాయనకూ లోక్ సత్తా గురించి తెలియజెప్పకపోవటం ఎవరిది తప్పు?"
తప్పు మీది కూడా కదా... మీకు లోక్ సత్తా గురించి తెలిసి కూడా మీ పక్కింటి వాళ్ళకి చెప్పకపోవడం మీ తప్పు కూడా అవుతుంది...
శ్రీవారి చెణుకులు/చెతుర్లూ బాగానె ఉన్నాయి కానీ,ఇక్కడ సమస్య/తప్పు నాదీ/మీదీ కాదు,ఒక విభిన్నమైన రాజకీయపక్షంగా..ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన కనీస బాధ్యత సదరు లోక్ సత్తా పార్టీది.ఆ దిశగా జనాన్ని చైతన్యవంతుల్ని చేసుకుని వారిద్వారా కాగల గంధర్వకార్యాన్ని సాధించుకోవాలన్నది నా భావన.నేను లోక్ సత్తా కార్యకర్తను కాదు,ఆ పార్టీ తీరుతెన్నులను ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక జర్నలిస్టును మాత్రమే.
@రాజేంద్ర గారు
చలోక్తులు కాదండి... మనకి తెలిసిన మంచి మనం చెప్తేనే కదా తెలియని వాళ్ళకి తెలిసేది... జర్నలిస్ట్ పౌరుడు కాదా? ఓటు వెయ్యడా? కార్యకర్త అయితేనే చెప్పాలా? మీరు బాధ్యత తీసుకోవడం లేదేమో కదా? మీ పక్కనున్న వాళ్ళకి లోక్ సత్తా మంచి పార్టి అని చెప్పితే వోటు వెయ్యడం వెయ్యకపోవడం అటుంచి మీకు సంతృప్తిగా ఉంటుందేమో కదా? మంచి లక్ష్యాలకి ప్రచారం కల్పించానని...
Post a Comment