Wednesday, October 15, 2008

మన రాజకీయాలెందుకు ఈ విధంగా తగలడ్డాయి?

మన రాజ్యాంగ నిర్మాణం ప్రకారం ఒక రాజకీయ పార్టీ మనుగడకు మరే ఇతర విషయాలకన్నా ప్రజాదరణే కీలకాంశం. ఇటువంటి నిర్మాణంలో నేతల నిబద్దతే రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. మన దేశ ప్రజలలో అత్యధికులు నిరక్షరాస్యులు. అక్షరఙ్ఞానం ఉన్నా రాజకీయ చైతన్యం లేనివారు. అమాయకులు. మన నాయకులు మొదట్లో ప్రజాదరణ కోసం మంచి మార్గాలనే అనుసరించినా క్రమంగా ప్రజల అనేక బలహీనతలను సొమ్ము చేసుకుంటూ వారిని మరింత బలహీనపరుస్తూ వారిని ఎటువంటి అన్యాయమైనా సహించేలా, ఉదాసీనత వహించేలా మార్చేసారు. గతంలో ప్రజలు తనకు ఎరుకలో వున్నవారికి అన్యాయం జరిగేంతవరకు సహించేవారు, కాని ప్రస్తుతం తనదాకా వచ్చినా తేల్చుకోలేని స్థితిలో వున్నారు. ప్రజలను ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని సందిగ్దావస్థలోకి నెట్టేసారు. ప్రజలు ఈ సందిగ్దావస్థలో వుండగానే మరో కొన్ని దశాబ్దాలపాటు నిరాటంకంగా దోచుకుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో స్థాపించబడిన లొక్ సత్తా లాంటి పార్టీలు సిద్దాంతపరంగా దేశంలోని యువకులను ఊరించినా కార్యశీలత పరంగా ఇతర పార్టీలను ఎదుర్కొనే స్థాయిలో లేదన్నది నిరాశ పరిచే వాస్తవం. దీనికి అసలు కారణం సుషుప్త/సందిగ్ధావస్తలో ఉన్న ప్రజలను తగిన మోతాదులో ఆకర్షించక పోవటమే. ఏ కొద్దిమందికో(కాని నిర్ణాయక శక్తి ఇదే) తప్ప మన దేశం/రాష్ట్రం లోని అత్యధిక శాతం ప్రజలకు రాజకీయ విధానాలను అర్థం చేసుకుని నేతలనెన్నుకునేంత పరిణితిలేదన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మెజారిటీ ప్రజలు తమ పరిధిలోని స్వల్పకాలిక ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. స్వాభావికంగా నిర్ణాయక శక్తిని సిద్దాంత నిబద్దత కలిగిన పార్టీలు ఆకర్షించగలిగినా ప్రాధాన్య వోటును సంపాదించటానికి సిద్దాంతాలు సరిపోవు. రాజనీతిని ప్రదర్శించగలగాలి. రాజకీయ నిర్ణయాలను అమలుపరచగల కార్యసాధకులను ఆకర్షించడమో పెంపొందించడమో చేయాలి.

ప్రజారాజ్యం లాంటివి చేస్తున్న పని ఇదే. వారికి సిద్దాంతాలమీద అవగాహన లేదు. కాని ప్రజాకర్షణతో ప్రాధాన్య వోటును సులభంగా పొందుతారు. కార్య సాధకులనూ ఆకర్షిస్తున్నారు. వీరికి నిర్ణాయక శక్తిని ఆకర్షించే సిద్దాంతాలు లేకపోవడం పెద్ద లోటు. అయినప్పటికీ కొత్త పార్టీ కనుక, మరో మెరుగైన ప్రత్యామ్న్యాయం లేదు కనక కొంత నిర్ణయాత్మక వోట్లు వీరికి పడే సంభావ్యత వుంది. బహుముఖ పోటీలో అధికారాన్నీ సాధించవచ్చు. అధికార సాధన తరువాత ఇటువంటి పార్టీ నేతలు ప్రదర్సించే నిబద్దతను బట్టి అవి ప్రత్యేకతను సంతరించుకోవడమో లేక మరో మూస పార్టీగానో మిగిలిపోతుంది. చరిత్రను గమనిస్తే ఎందరో ఉత్తమ నాయకుల అధికార సాధనాపర్వంలో విలక్షణత దుర్లక్షణాలుగా రూపంతరం చెందడం అనుభవమే.

దేశ ప్రగతికి సిద్దంతాలు, నిబద్దత ముఖ్యమైనా అధికార సాధనకు కీలకాంశం ప్రజాకర్షణ. ప్రజాస్వామ్యంలో ప్రజలకంటే విలువైనది ఆ ప్రజలిచ్చే అధికారం. సిద్దాంత నిబద్దత కలిగిన నాయకులు రాజకీయ పరిణితిని ప్రదర్శించి దేశానికి నష్టం కలిగించని ప్రజాకర్షక నిర్ణయాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో మేధావులైన యువకులకు లోటులేదు. కళాశాల స్థాయిలో రాజకీయాలపై చర్చను లేవదీస్తే మన దేశమెదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొండం అసాధ్యమేమీ కాదు. ప్రజలను ఆకర్షించటంలో చతురతను విధానాల ప్రకటనలో నిబద్దతను చూపిస్తే ఉత్తమ రాజ్యంగా ఎదగడం కష్ట సాధ్యమే.