Sunday, July 27, 2008

ఉగ్రవాదం - ఎలా నియంత్రించటం?

ఈ ప్రశ్న ఆలోచించవలసింది ఎవరు?

పోలీసులా, దేశనేతలా, సైనికులా, ఉపాధ్యాయులా, తల్లి తండ్రులా, మొత్తం ప్రజానీకమా? ఎవరు దీనికి భాద్యులు? ఎందుకిలా చేస్తున్నారు? ఏమిటి దీనికి పరిష్కారం? పోలీసులు, మన నిఘావ్యవస్థ దీన్ని నియంత్రించ గలుగుతుందా? నియంత్రిస్తే ఎంతవరకు నియంత్రించగలుగుతుంది?

ప్రజలకు(మనలోని ప్రతిఒక్కరికీ) తమమీద తమకు నియంత్రణ లేకపోతే పోలీసులేకాదు, ఆ దేవుడే దిగివచ్చినా పూర్తిగా ఇటువంటి అఘాయిత్యాలను ఆపడం కష్టం.

మొదట ఇటువంటి హింసాత్మక చర్యలకు కారణమేంటంటే, సమాజం మీద కాని, సమాజం లోని ఒక భాగం మీద కాని అనేక కారణాలతో కసి పుట్టిన కొంతమంది ఇతరులపై దాడికి తెగబడటం. దురదృష్టవశాత్తూ వీరు గతంలో అణగదొక్కబడినవారుగా గానీ, అణగదొక్కబదుతున్నారని భావిస్తున్న వారుగా గాని వున్నారు.

మన దేశానికి సంభందించినంత వరకూ, నక్సలైట్లూ, ఇతర విప్లవ గ్రూపులు, విదేశీ ఉగ్రవాదం కారణాలుగా ఉన్నాయి. గతంలో, మన సమాజనిర్మాణం, వృత్తులను బట్టి వివిధ కులాలుగా విభజింపబడ్డాయి. కాని వీటిలో అగ్ర, నిమ్న కులాలని మరో విభజన తేవడం ద్వారా సాంఘిక అసమానతలకు తద్వారా కొన్ని దురాచారాలు ఏర్పడి సమాజం లోని ఒక భాగం అణగద్రొక్కబడింది. ఇటువంటి విభజనలు ఈ ప్రపంచంలోని ప్రతి సమాజంలోను వున్నాయి. ఇవి ఇలాగే కొనసాగినంత వరకూ ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదు. కాని, కొంతమంది పెద్దలు ఈ అసమానతలను గుర్తించి చక్కదిద్దటం మొదలు పెట్టి, సమాజం మార్పు చెందటానికి సిద్దపడుతున్న తరుణంలో సదరు అణగద్రొక్క బడిన వర్గంలోని కొందరు గతంలో జరిగిన అన్యాయాలకు పగ తీర్చుకోవాలని భావించినపుడే ఇటువంటి ఉగ్రవాద చర్యలకు ఆస్కారం ఏర్పడుతుంది(ఇటువంటి భావనకు, కొంతమంది నన్ను నిందించవచ్చు కాని, ఇది అంగీకరించవలసిన విస్మరించలేని నిజం). ఇటువంటి పగ వున్నవారు, తమకు అనుకూలమైన వాతావరణం కనుపించగానే, అవకాశం దొరికినప్పుడల్లా, ఎదుటివారికి వారిలాగానే అన్యాయం తలపెడతారు. దీనితో ఇటువైపు వర్గం వారి అహం దెబ్బతిని ప్రతిచర్యలకు దిగుతారు. దీనివల్ల సదరు విద్వేషాలు పెరుగుతాయే కానీ, పరిష్కారం ఎక్కడ? ఇద్దరిలో వున్న తేడా ఏంటి? ఎదుటివారిని, వారి పూర్వపు చర్యలను నిందించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బలం పెరిగినప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా వున్నపుదు, వారిని క్షమించు. నీకు అన్యాయం చేసినవారు పశ్చాత్తాపంతో దహించుకుపోవటమే కాదు, మళ్ళీ ఏ సందర్భంలోనూ అటువంటి తప్పులను పునరావృతం కానివ్వరు.

వైరాగ్యంగా అలోచిస్తే, అసలు ప్రపంచంలో, ప్రకృతిలో అసమానతలు లేని ఒక సందర్భం ఏది? ప్రకృతిలోని ఏ రెందు వస్తువులు కాని, విషయాలు కాని, వ్యక్తులు కాని ఒకటెలా అవుతాయి? అంతెందుకు, మన చేతిలోని ఐదు వేళ్ళు సమానం కావే!! ఎడమకంటికి కుడికంటిమీద కోపం వస్తే ఎలా? కుడికంటికి ఆధిక్యభావం వుంటే అది అర్థరహితం కాదా? సృష్టిలోని ఏ రెండు ఒక్కటి కాజాలవు. రెండు ఒక్కటి కాగలిగితే ఆ సృష్టే అనవసరం. దేనికదే వైవిధ్యంగా వుండవలసిందే. కాని సమస్య ఎక్కడంటే, ఏ ఒక్కదాన్నొ అధికంగానో, అధమంగానో భావించటమే. ప్రతి సృష్టికీ దేనికదే ఒక ప్రత్యేకత, పరమార్థం వుంటుంది. మనం దానిని గమనించి నడచుకోగలిగితే చాలా వరకు అసమానతలు తొలగిపోతాయి.


ఇక ఆచరణా మర్గానికి వస్తే,
1. ఇంట్లో

  • భర్త, భార్యని గౌరవించాలి. ఒకరినొకరు అవమానించే సందర్భాలను తగ్గించుకోవాలి.
  • కొడుకుకూ, కూతురికీ మద్య పెంపకంలో వివక్ష చూపొద్దు.
  • పిల్లల మద్య నున్న అసమానతలను కించపరచవద్దు.
  • కోడలికీ, కూతురికీ/కొడుకుకూ వివక్ష చూపొద్దు.
  • అత్త మామలకు, తల్లిదండ్రులకూ భేదం చూపొద్దు.
  • పిల్లలకు క్షమాగుణాన్ని, ఓర్పును, పెద్దల పట్ల మర్యాదను నేర్పండి.

2. ఇంటిబయట
  • పిల్లలకు, కుల/మత సంభందమైన విభేధాలను నేర్పించకండి(కనీసం పాఠశాల వయస్సులో) . ఈ విషయంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది.
  • ఎదుటివారిని కించపరచడాన్ని తమాషాగా కూడా చేయవద్దు/ప్రోత్సహించవద్దు.
  • ఇటువంటి సందర్భాలెదురైనప్పుడు లౌక్యంగా తప్పించుకునే మార్గాలను నేర్పండి/నడచుకోండి.
  • విషమ పరిస్తితుల్లో ఆవేశం కాకుండా ఆలోచనను అలవాటు చేసుకోవటం.
పై మార్గాలు అల్లోపతిలా తక్షణ పరిషారం కాకపోయినా, ఆయుర్వేదంలా దీర్ఘకాలంలో స్థిరమైన ఫలితాలనివ్వగలవు.

తుదిపలుకు: క్షమించటమంటే, అణగారి ఉండటం కాదు, ధైర్యాన్ని ప్రదర్శించి ఆత్మబలాన్ని చూపించి ఎదుటివారికి హాని తలపెట్టకపోవటం.

గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనిచగలరు.

Friday, July 25, 2008

దేవుడు, మనిషి, దెయ్యం - ఏది నిజం

దేవుడున్నాడా అంటే, నేనెప్పుడూ చూడలేదు కానీ, లేదని చెప్పటానికి కూడా ఆస్కారం లేదు. ఉన్నాడనటానికి రుజువులు చూపించడం ఎంత కష్టమో, లేదని చెప్పటానికి(నమ్మించటానికి) అంతకంటే కష్టం. ఏ దేవుడైనా, ఏ మతంలోనైనా మంచికి ప్రతినిధి గానే తారసపడతాడు.కొందరు దేవుడు అనాకారి అని నమ్మితే మరికొందరితో తమ దేవుడు అనంత రూపుడుగా పూజింపబడతాడు. కొందరు ప్రార్థనల ద్వారా దేవుడిని మచ్చిక చేయలని చూస్తే మరికొందరు యఙ్ఞ, యాగాదులు నిర్వహిస్తారు, కానుకలు సమర్పిస్తారు.

దెయ్యన్ని కూడా ఉన్నాడనికాని, లేడనడానికి కాని రుజువులు తేవడం కష్టం. ఏ మతం లోనైనా దెయ్యం సాధారణంగా చెడుకు ప్రతిరూపంగా కనపడతాడు. దేవుడిలాగానే దెయ్యం కూడా అనేక రూపాలుగా ద్వేషించబడతాడు. సాతానుగా, రాక్షసుడుగా, పిశాచంగా అనేక వైవిధ్య అవతారాలతో దేవునితో సమానంగా ప్రాధాన్యత కలిగివుంటాడు.

ఇక మనిషి విషయానికి వస్తే, దేవుడు/దెయ్యం ఉనికికి సంబంధించిన సందిగ్దతని ఆసరా చేసుకుని, తన చుట్టూ ఒక మాయా ప్రపంచాన్ని నిర్మించి జగన్నాటకానికి తెరలేపిన ఒక మహా మేధావి. తన అవసరం కోసం, తనలాంటి ఇతరులను నియంత్రించటం కోసం దేవుడిని, దెయ్యాన్ని అనేక రూపాలలో ప్రతిసృష్టి చేసిన మహానుభావుడు. దేవుని మంచిని దెయ్యపు చెడును తనలో ఇముడ్చుకొని సృష్టి రహస్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్న ఒక శాస్త్రవేత్త. నిజానికి దేవుడు దెయ్యమనేవి మనిషికున్న రెండు పార్శ్వాలేనేమో. ఇతరులకోసం(మనిషికానీ, మరేఇతర ప్రాణీ కాని, మరేవిషయంకోసం కానీ) తన స్వార్థాన్ని లెక్కచేయక జీవించగలిగే వారే దేవుళ్ళు. అన్ని గుణాలనూ ఆదర్శంగా ఆచరించ గలిగినవాడు దేవుడు. కొన్ని లోపాలతో చాలా వరకు సుగుణాలతో ఆవిర్భవించిన మానవులే గతంలో దేవుళ్ళుగా చలామణి అయ్యారు( రాముడు, క్రీస్తు, మహమ్మద్, బుద్దుడు, గురునానక్...). వీరి పేర్లతో అనేక మతాలూ, సాంప్రదాయాలూ ఏర్పడ్డాయి. వాటి లోని కొన్ని లోపాలను ఇతరులు పూరించే ప్రయత్నంలో మరిన్ని జాతులు ఆవిర్భవించాయి. కాలక్రమేణా వీళ్ళు ఒకరినొకరు ద్వేషించుకొని, ఒకరి లోపాలను మరొక్కరు ఎత్తిచూపించి ధూషించి, ధూషించబడి మతవిద్వేషాలకు జాతి వైషమ్యాలకు తెర తీసి తమలోని దెయ్యానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.

మనిషి తను సృష్టించిన మాయలో తనే ఇరుక్కుని దేవుని పేరుతో దెయ్యమై కూర్చున్నాడు. మనిషి దేవుడు కాకపోయినా, సాటి మనిషిని మనిషిగా గుర్థించి వారిలోని గొప్పదనాన్ని నేర్చుకుని, లోపాలను పూరించగలిగితే/మన్నించగలిగితే వసుధైక కుటుంబం ఆవిర్భవిస్తుంది.

Friday, July 18, 2008

అణు ఒప్పందం - శ్వేత పత్రం

ఈ వ్యాసాన్ని వీలయినంతవరకూ అంకెలు, సాంకేతిక పదాలతో నింపకుండా అందరికీ అర్థమయ్యేవిధంగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
అణు ఒప్పంద లాభాలు:
  • అణు ఇంధన సరఫరా కూటమి(NSG) ద్వారా, భారత్ కు ఇంధన సరఫరా.
  • అణు విద్యుత్ ఉత్పాదనకు కావలసిన పరికరాలు.
  • క్రొత్త అణు విద్యుదుద్పాదన కేంద్రాల ఏర్పాటు. తద్వారా కలిగే ఉపాధి అవకాశాలు.
  • అమెరికాతో స్నేహం పెరుగుతుంది(ఇది లాభమా నష్టమా అన్నది మీ అలోచనకే విడిచిపెడుతున్నాను).
అణు ఒప్పంద పరిమితులు:
  • నిరంతర సరఫరాకు హామీ లేదు.
  • సాంకేతిక పరిఙ్ఞాన బదలాయింపు లేదు.
  • పరికరాలను NSG నుంచే కోనుగోలు చేయాలి.
  • మిగిలిన దేశాలతో పొలిస్తే IAEA తనిఖీ పరిధి లోకి వచ్చే కేంద్రాలు భారత్ లో అధికం.
  • భారత దేశానికి అణుశక్తి హోదా లేదు, కనుక రక్షణ పరిశోధలమీద అప్రకటిత నియంత్రణ వర్తిస్తుంది.
  • హైడ్ చట్టం ద్వారా, అమెరికాకు, అణు సరఫరా కూటమిని నియంత్రించే(భారత్ విషయంలో) ఏకపక్ష అధికారం.
అప్రకటిత అంశాలు:

1. భారత్/అమెరికా లు అణు పరీక్షల పై ఎటువంటి హామీ ని ఇవ్వక/పొందక పోయినా, భారత్ కు అణు హోదా ఇవ్వక పోవటం గమనార్హం. ఇది పౌర అణు ఒప్పందం మాత్రమే అని ప్రభుత్వం వాదిస్తోంది. కాని ఇది మనకు అప్రకటిత నైతిక ఆంక్షలను వర్తింప చేస్తుంది.
2. IAEA ముసాయిదాలోని 'దిద్దుబాటు చర్య ' ఏమిటో వివరణ లేదు. ఇది రెండువైపులా అపోహలకు తావిచ్చే అంశం.
3. మన దేశం లోని ధోరియం నిల్వలను వినియోగించేందుకు పరిశొధనలు జరుగుతున్న సమయంలో, అనేక సంక్లిష్టతలతో కూడిన యురేనియం దిగుమతికి ఇంత తొందర అవసరమా? యురేనియం దిగుమతికి కొన్ని వేల కోట్లు పెట్టుబడి, మన దేశీయ పరిశోధనలపై వెచ్చించే మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
4. మన ప్రభుత్వ అత్యుత్సాహం and over optimism.

పరిశీలనాంశాలు:

ఈ ఒప్పంద విషయంలో అమెరికా కనబరుస్తున్న అమితాశక్తిని, మన నేతలు (ముఖ్యంగా మన్మోహన్ గారు) ఎంతవరకు అర్థం చేసుకున్నారు. అమెరికాకు వేల కోట్ల డాలర్ల వాణిజ్య ప్రయోజలే ప్రాతిపదిక ఐతే పెద్ద నష్టం లేదు కానీ, దీన్ని అవకాశంగా రాజకీయంగా మనల్ని కట్టడి చేయాలని చూస్తే మనం ఎంతవరకూ సన్నద్దంగా వున్నాం?

ఎన్నో దేశాలకు అవసరార్థం సహాయం చేసి, వారిని రాజకీయంగా తన కను సన్నల్లో నడిపించుకున్న,నడిపించుకుంటున్న అమెరికాను మనం ఎంతవరకూ విశ్వసించగలం?

అణు ఒప్పందం లాంటి కీలక విషయాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేసి రాజకీయ పరిణామాలను చర్చించి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించి వుండవచ్చు. ఎన్నో విషయాలలో ఇటువంటివి జరిగాయి. వామపక్షాలను వదిలేస్తే, ప్రతిపక్షం కూడా ఒప్పదాన్ని పూర్తిగా వ్యతిరేకించక పోవడం ఇక్కడ గమనార్హం. అలాగే ఒబామా బుష్ కు మద్దతు తెలపడం విశేషం.

ఇక మన్మోహన్ గారి విషయానికొస్తే, దేశ భక్తి, నిబద్దత విషయంలో శంకించక పోయినా, రాజకీయ పరిణితి లోపించిందని అనుమానంగా వుంది. సోనియా సహాయం లేకుండా కాంగ్రెస్ రాజకీయాలనే అర్థం చేసుకోలేని ఆయన, బుష్ చూపిన కొద్దిపాటి సాన్నిహిత్యానికే ఆయనను మంచి నేతగా మన శ్రేయోభిలాషిగా ఒకానొక సందర్భంలో కొనియాడారు. తనపై వస్తున్న అసమర్థ ప్రధాని అనే మచ్చను చెరిపేసుకోవటానికి ఆయన మొండిగా దీనికోసం ఎగబడితే మాత్రం మన పూర్వపు నేతల కష్టంతో పాటు, భవిష్యత్తు నాశనమవుతుంది.

మనం కోరగలిగిన సవరణలు:

1. ఆణుశక్తి దేశాలకు వర్తించే నియమాలను పొందుపరచటం(ఇది చాలా కష్టం).
2. హైడ్ ఒప్పందంలోని ఏకపక్ష నియమాలకు తెరవేయటం.
3. మన పౌర, రక్షణకు సంభందించిన అణు పరిశొధనలపై నిర్ధిష్ట హామీని పొందటం.

Monday, July 14, 2008

భారత దేశం : పెళ్ళి- ప్రాతిపదిక

కొంతకాలంగా బ్లాగు లోకంలో భారతీయ (వివాహ) వ్యవస్థపై చాల విసుర్లు వినిపిస్తున్నాయి.
ఏన్నో విషయాలు చర్చకు వచ్చినా, భారత దేశంలో పెళ్ళికోసం ఎంచుకున్న ప్రాతిపదిక తప్పన్నట్లుగా ఇటివల ఒక ప్రముఖ బ్లాగావధానిగారు (విసురు కాదు సుమా!) అభిప్రాయపడటం నా దృష్టిని ఆకర్షించింది. వాటికి చాల ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడో చిన్న సందేహం నా మెదడును తొలచి నా మొదటి బ్లాగుకు ప్రేరణ అయింది. సదరు బ్లగావధానిగారి, చర్చ లోని కొంత సమాచారాన్ని వినియోగిస్తూ ఈ టపా కొనసాగిస్తాను. అన్యధా భావించక నా సాహసాన్ని ఆశీర్వదించ మనవి.
ఇక విషయానికి వస్తే, పెళ్ళికి ప్రధాన ప్రాతిపదికలుగా మూడింటిని ప్రస్తావించారు. 1. పరువు-ప్రతిష్ట 2. ఈడూ-జోడూ 3.డబ్బూ-దస్కం. నిజానికి ఇవేమీ అంత అనవసరపు విషయాలు కావు. మన పెద్దలు బాగానే అలోచించి ఏర్పాటు చేసిన ఒక విధానం. ఎవరైనా గుండెలమీద చెయ్యి వేసుకుని పెళ్ళికి పై మూడు ప్రాతిపదికలూ అనవసరమని చెప్పగలరా? సమస్యంతా వాటిని వక్రీకరించి(మన కోర్టు చట్టాల వలే) అమలు చేయటంలోనే వుంది.
1. పరువు-ప్రతిష్ట:
ఒక అమ్మాయిని, అబ్బాయిని ముడి పెడుతునపుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం వారిద్దరి జీవితంతో పాటు రెండు కుటుంబాల భవితవ్యం నిర్ణయించబడుతాయి. ఇరువురూ గత చరిత్రలను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. గత చరిత్ర భవిష్యత్తు ప్రవర్తనకు వర్తిస్తుందా అని ఎవరికైనా సందేహం రావచ్చు. కాని గత చరిత్రను పరిశిలిస్తే:), అధిక శాతం అలాగే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి కట్టుబాట్ల వల్ల ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో జాగ్రత్తగా ఉంటూ, ఎదైనా తప్పు చేయవలసి వచ్చినపుడు తమ భవిష్యత్తు గురించీ, తమ కుటుంబ/వంశ పరువు గురించీ ఒక్కసారయినా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన సంప్రదాయమది. గతంలో మన సమాజం చిన్నదవటం (జనాభాలో), అందరూ ఈ సూత్రానికి కట్టుబడి ఉండటం వల్ల, అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాలూ, బేరీజు వేసుకునే అవకాశం వుండేది. సమకాలీన ప్రపంచంలో ఈ కట్టుబాటును యధాతథంగా అనుసరించకుండా కాలానుగుణంగా జరిగిన పరిణామాలకు విలువనిస్తూ సందర్భానుసారం మూల కారణాన్ని అన్వయించుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు.
2. ఈడూ-జోడూ:
ఈడూ-జోడూ అంటే రూప లావణ్యాలనుకుంటే నిజంగా ఇది ఒక ప్రహసనమే. ఇవి కాలంతో బాటుగా క్షీణించే/అంతరించే విశేషణాలు. ఇక మనసు, ప్రవర్తన, గుణ గణాలు బేరీజు వేసుకుంటే, లోపాలు లేని మనిషెక్కడ? అసలు ఎదో ఒక లోపం లేని వాడు మనిషేకాదు, ఏ దేవుడో, దయ్యమో(దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళ కోసం) అయుండాలి. ఈడూ, జోడూ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరిని మరొకరు పూరించటమే. వీటికి రూప లావణ్యాలు సరి కుదిరితే పరిపూర్ణమే కానీ అవే పరమార్థమూ కావు, నిర్లక్ష్యం చేయవలసిన అంశమూ కాదు.
3.డబ్బూ-దస్కం:
డబ్బూ, దస్కం కూడా మంచి జీవనానికి అవసరమే. అంగీకరించటానికి ఇష్టపడక పోయినా, కష్టమైనా ఇది నగ్న సత్యం. మనిషి యొక్క గొప్ప ఆవిష్కరణలలో డబ్బు ఒకటి(ఈ పాయింటుపై ఎవరికైనా అభ్యంతరం వుంటే, మరెప్పుడైనా చర్చిద్దాం). కానీ పెళ్ళి తంతులో ఇది కట్నం గానో, కన్యాశుల్కం గానో రూపాంతరం చెందటం దురదృష్టం. పరిస్థితిని బట్టి ఇద్దరి సహజీవనానికి(సంతానంతో సహా) అవసరమయినంత ధనం సంపాదించగల సత్తా ఉందాని సరి చూసుకోవటం ఎంతమాత్రం తప్పు కాదు.
ఖచ్చితంగా ఇవే కాకపొయినా, ఇటువంటి ప్రాతిపదికలతో పాటు, వీటికి అనుసంధానిచబడిన వాటిలో, కొన్ని సందర్భాలలో లోపాలు కనిపించినా, లోపాలు లేకపొయినా పెద్దలు అలోచించి తమ విచక్షణాధికారంతో కొన్ని పెళ్ళిళ్ళను జరపటమో/ఆపటమో చేసేవారు. కొన్ని రహస్యాలను, తద్వారా కలిగే ఇబ్బందులనూ కొన్ని సందర్భాలలో వివరించక, చాల సందర్భాలలో వివరించ లేక(నిరక్షరాస్యత, పరిణితి లేమి లాంటి కారణాలతో), కొన్ని సూత్రాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేయించేవారు. కాల క్రమేణా అసలు వుద్దేశ్యాలు మరుగున పడినా ఇవి సంప్రదాయాలుగా స్థిరపడ్డాయి. చిత్తశుద్ది కలిగిన నాయకులున్న సమాజంలో ఇవి వ్యక్తిగత ఇష్టాలకు విలువనిస్తూ, సమాజహితాన్ని పరిగణలోకి తీసుకుని సరిగ్గానే అన్వయింప బడతాయి.
కాని, కాలగతిన ఇవి దుష్టుల(అధికారం, బలం, దౌర్జన్యం లాంటివి) పాలబడి వక్రీకరించబడి దుస్సంప్రదాయాలుగా పరావర్తనం చెంది ప్రస్తుత రూపంలో చెలామణి అవుతున్నాయి. దీనికి ప్రాతిపదికలను నిందించటం కన్నా (రచయిత యొక్క ఇతర అభిప్రాయలతొ ఏకీభవించినా, ఈ ఒక్క విషయం లోనే విభేదిస్తున్నాను) వాటి అసలు భాష్యాలను గ్రహించి మన పద్దతులను సాన పడితే వజ్రాల్లాంటి మన సంస్కృతి, సంప్రదాయాలు జీవం పోసుకుంటాయనడంలో సందేహం లేదు.
స్వయం సమృద్ది, విద్యార్జన, స్వయం ప్రతిపత్తి, స్వేచ్చ మొదలైన సుగుణాలు కలిగిన మనం (మన ప్రస్తుత భారత సమాజం) కాస్త వివేచనతో పాశ్చాత్య సంస్కృతి లోని కొన్ని జాడ్యాలను వంటపట్టించుకోక మన సంస్కృతి నేర్పిన కట్టుబాట్లకు గౌరవమిస్తూ అవసరమైనప్పుడు సమీక్షిస్తూ ముందుకు పోతే మనం మనిషి భవిష్యత్తుకు అద్వితీయమైన వారధి కావచ్చు.
గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనిచగలరు.
ఈ టపాలో ఉదరహరించబదిన టపాకు లంకె: http://parnashaala.blogspot.com/2008/07/blog-post_11.html