Tuesday, August 26, 2008

భారత సంసృతి నీచమైనదా?

ఈ మధ్య ఎదో ఒక సాకుతో స్వీయ నిందకు పాల్పడటం ఎక్కువయిపోయింది. ఇది ఒక అభ్యుదయవాదంగా చలామణి అవుతోంది. పర సంస్కృతీ పీడలను అరువు తెచ్చుకోవటం అభ్యుదయ వాదమా? ఇతరులు దేనినైతే వద్దనుకొంటున్నారో మనం దానిని అభ్యుదయవాదం పేరుతో దిగుమతి చేసుకోవలనుకుంటున్నాం.
కాస్త ఆలోచించండి. మనలో, మన సంస్కృతిలో మంచేలేదా? ఎందుకీ పర వ్యామోహం? లోపాలులేని సంస్కృతి ఏది? వాటిని బూచిగా చూపి ఇతరుల్లోని చెడును ప్రోత్సహించటం ఎంతవరకూ సబబు. విమర్శలు అహ్వానించదగినదే వితండవాదం కాదు.
మొత్తంగా చర్చిస్తే ఒక గ్రంధమే అవసరమౌతుంది . ఒక టపాలో జరుగుతున్న చర్చను గమనించండి.
శంఖారావం లోని ఒక టపాలో జరిగిన చర్చను చూడండి. దానిలో నా సమాధానం ఇక్కడ ఇస్తున్నాను.


భారతదేశ దౌర్భాగ్యానికి అసలు కారణం అత్మపరిశీలన పేరుతో ఆత్మనింద చేస్తూ మూర్ఖంగా వాదిస్తున్నవారే. వీళ్ళు రాజకీయనాయకులకన్నా ఉత్తములు. మన సంస్కృతిని నిందించటంలో వీరికొక విజయగర్వం వుంటుంది. దీనీతోనే వీళ్ళూ గొప్పవాళ్ళమైపోయామని భావిస్తారు. మనలోని మంచికి మినహాయింపులను ఉటంకిస్తూ అదే మన సంస్కృతన్నట్లు ప్రచారం చేస్తారు. ఇతరుల దౌర్భాగ్యాపు పనుల్లో మంచిని వెదకి ఉత్తములనిపించుకుంటారు. వీరికెపుడూ దూరపు కొండలు నునుపే. పోనీ నున్నగా వున్నాయికదా అని దగ్గరికెళ్ళి పరిశీలించరు. ఇటువైపునుడే శల్యసారధ్యం చేస్తుంటారు.

"ఒకనాడు శృంగారం విషయంలో, చాలా క్యాజువల్�గా వున్న మనం, తర్వాత దాన్ని అవసరానికి మించి నిషేధించినట్ట్లు అనిపిస్తుంది. దాని విషయంలో సభ్యత కోసం కొన్ని నిధినిషేధాలు వుండవలసిందే "
-->ఇది సంపూర్ణంగా అంగీకరించాలి. మన సంస్కృతిలో శృంగారం కొన్ని హద్దులకు లోబడి క్యాజువల్గా ఉండాలని చెప్పారుకాని విచ్చలవిడితనాన్ని ప్రోత్చహించదు. నైతిక విలువనాపాదించటం ఆ క్రమంలోనిదే.

"ఒకపక్క వంద కోట్ల జనాభా కనపడుతుంటే, మరో పక్క అదేదో దొంగచాటుగా చేయవలసిన పనిగా మనం భావిస్తుంటే, దాన్ని ద్వందప్రవృత్తిగానే భావించాలి." --> ఇది ఖండించతగినది. ఇది తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్ని పనులు నలుగురిలో చేయవచ్చు. కొన్ని నాలుగు గోడల మధ్యే వుండాలి. ఆలోచించండి. ఇది ద్వందప్రవృత్తి కాదు. అసలు సిసలు పరిణితి.

"తమ తమ శరీరాల గురించి, శరీర సంబంధాల గురించి కనీస విజ్ఞానం ఎంత మంది తలిదండ్రులు వారి పిల్లలతో మాట్లాడ గల్గుతున్నారు?" --> నాకు తెలిసి ప్రతి(కనీసం మెజారిటీ) అమ్మా తనకూతురుతో ఈ విషయాలు చర్చిస్తుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో.

"."మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి" అన్నట్లుంది మీ వివరణ.కామసూత్ర మనదేశంలో పుడితే ఏం? ఖజురహో మనదేశంలో ఉంటే ఏం? ప్రస్తుతం మనదేశంలో శృంగారం "పాపం" ఇంకా చెప్పాలంటే "అపరాధం"." --> ఎవరు చెప్పారిలా? మన సంస్కృతి ఎలా వక్రీకరింపబడుతోందో చెప్పటానికి ఇది అసలైన ఉదాహరణ.ఇలా భావించి వుంటే ఈ దేశంలో పెళ్ళీళ్ళే జరుగవు. మనం అపరాధం అనేది హద్దులు మీరిన శృంగారాన్నే. వయసుకు మించిన ఆలోచనలనే. వయసెందుకు ప్రధానమంటే వయసుతోనే విచక్షణ కలుగుతుంది. మహేష్ గారూ, మీ సామెతను ఇతరవిషయాలకు కూడా విలోమంగా అన్వయించండి. చాలా సార్లు మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్నెందుకు నిందిస్తారు.

"అడ్డమైన వేషాలు వెయ్యబట్టే... ఇపుడు అడ్డమైన రోగాలు వస్తున్నాయి. మన ఋషులు, వారి సంప్రదాయాలు పాటించడం మంచిది. ఎయిడ్స్ వల్ల మన శరీరధర్మం గురించి తెలుసుకోవాలి అన్నారు. అసలు ఎందుకు వచ్చింది. ఒళ్ళు కొవ్వెక్తి చేసేపనుల వల్లేగా..." --> ఇందులో నిజం లేదా? prevention is better than cure అదే మన సంస్కృతి నేర్పుతున్నది. దానికి పెడార్థాలు తీయవద్దు.

"విచ్చలవిడితనంవల్ల AIDS రాదు. రక్షణ లేకపోతే వస్తుంది.ఇది విలువలకి సంబంధించిన విషయం కాదు.ఆరోగ్యానికి సంబంధించిన విషయం.కాబట్టి ఇక్కడ value judgement లు మాని మానవత్వాన్ని ప్రదర్శించండి.AIDS Sex ద్వారా రాదు. unprotected sex ద్వారా వస్తుంది. ఇందులో మీరు ఉద్భోధించే విలువలకన్నా, అజాగ్రత ముఖ్యకారణం." --> విలువలకు మించిన రక్షణా ఎన్నటికీ మీకు దొరకదు. రక్షణతో కూడిన విచ్చలవిడితనం AIDS నిర్మూలించబడుతుందని నమ్మితే మీరు మనిషి తత్వాన్ని తక్కువ అంచనా వేసినట్లే. unprotected sex ద్వారా మాత్రమే AIDS రాగలదనే మీ అపోహను ఏమనాలి?

" ఏ విషయంలోనైనా సత్యాన్ని దర్శించాలంటే ‘విశ్వాసం ’, ‘ఋజువు ’, ‘హేతువు ’ అనే మూడు కోణాల్లో పరిశీలించాలి. కానీ మీరు ‘హేతువు ’ అనే ఒకే ఒక్క కోణం మీదే ఆధారపడుతున్నారు. ఇలా అయితే మీరు వాదమేమో గానీ ‘వాదన ’ మాత్రం బాగా చేస్తారు." --> అఖరాలా నిజం. ఉత్త హేతువాదులంతా మూర్ఖ శిఖామణులు.

Tuesday, August 12, 2008

అభినవ్ - స్తిత ప్రఙ్ఞత

అభినవ్ కు అభినందనలు.


అభినవ్ ఒక మంచి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. మన దేశ స్థాయితో పోల్చుకుంటే అతడు సాధించింది అపూర్వం, అనితర సాధ్యం. కాని అతని ప్రవర్తనలో ఆ స్తాయి గర్వం కనిపించలేదు. నింపాదిగా తన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. పిచ్చిగంతులు వేయలేదు. అవసరానికన్నా కొంచం తక్కువగానే స్పందిచాడు. పెద్దగా సంచలన వ్యాఖ్యలేవీ చేయలేదు. తన విజయగర్వంకంటే భవిష్యత్తులో భారత విజయగీతికనే అకాంక్షించాడు. తన విజయం ఇతరుల్లో స్పూర్తి రగిలించాలని కోరుకున్నాడు.


మరో ప్రతిభాశాలిని మునగచెట్టెక్కించేందుకు కలిగిన సదవకాశానికి(సంచలనానికి) గండిపడటం మీడియాకు రుచించక పోయినా, ప్రస్తుతం ఈ నిగ్రహాన్ని విజయాన్ని కలగలిపి అతడిని మునగచెట్టు ఎక్కించటానికి విపరీతంగా శ్రమిస్తున్నారు.


ఒక పుట్టు సంపన్నుడిగా(భారతంలో చాలా సార్లు ఇది నేరంతో సమానం), ఉన్నత విద్యావంతుడిగా, ఒక సంస్థకు అధిపతిగా ఇటువంటి భావోద్వేగాలకు, నడమంత్రపు సిరి కలిగించే ఉన్మత్తానికి అతీతంగా వుండగలడనే ఆశిద్దాం. డబ్బు అతనికి కొత్తేమీ కాదు కాని కొత్తగ వస్తున్న కీర్తి శిఖరంతోనే జాగ్రత్తగా మెలగాలి.


లేకపోతే మనం సానియా, కాంబ్లి, మల్లీశ్వరి, రాథోడ్ లాగా ఆణిముత్యాలను కోల్పోవలసి వస్తుంది. అప్పుడప్పుడు కనిపించే ఈ మెరుపులను ఒడిసిపట్టి మన నైపుణ్యాలకు సాన పట్టాలే గాని, వారిని తేరుకోలేనంత ఉద్విఙ్ఞానికి, అందుకోలేనంత ఎత్తుకూ తరిమేసి, విఫలమైనప్పుడు అగాధానికి తొక్కేయటం సబబు కాదు.


అభినవ్ కు వచ్చి పడుతున్న ప్రశంసలు, బహుమానాలు మంచిదే కాని, వాటిని గుత్తగుంపగా అతనొక్కడికి మాత్రమే అంచించకూడా తగినన్ని నిధులు ఏర్పాటు చేసి ఇతర క్రీడలకూ వసతులు, సాంకేతిక సహకారాన్ని పెంచాలి. ఇటువంటి సందర్భాలలో, అతణ్ణీ తగురీతిలో సత్కరించటంతో పాటు, అతనీ క్రీడా విభాగానికీ(వీలును బట్టి ఇతర క్రీడలకూ) తగినంత వసతులు కల్పించాలి. ప్రస్తుతం అనేకమంది చిన్నారులు అతని విజయంతో స్పూర్తి పొంది వుంటారు. ఈ వాతావరణాన్ని మనం సొమ్ము చేసుకోవాలి. క్రీడలకు సంభందించిన వసతులను అక్కడక్కడా ఏర్పాటు చేసి, శిక్షణనివ్వాలి, మెరికలను గుర్తించి మెరుగు పరచాలి. ఈ స్పూర్తితో అందరినీ కనీసం ఒకమెట్టు అధికంగా ఎక్కేందుకు ప్రోత్సహించాలి. పాఠశాలల్లో తగినంత వసతులు కల్పించి పోటీ వాతావరణాన్ని కలిగించాలి.


ఎటువంటి స్పూర్తినైనా, ఎంతటి ఉత్తేజాన్నయినా నిర్వీర్యం చేసే శక్తి సామర్థ్యాలు మన రాజకీయనాయకులకు (రాజకీయ)ఉగ్గుపాలతో నేర్చిన విద్య. ఎక్కడైనా డబ్బులుగానీ, ఓటు బ్యాంకు గాని కనిపిస్తే దాన్ని పిండి చేసి పిప్పితీసేవరకూ వారు నిద్రపోరు. ప్రస్తుతం హాకీ, క్రికెట్టుకి పట్టిన/పడుతున్న దుర్గాతి వారి నిర్వాకం ఫలితమే.


ఇటువంటి సందర్భంలో మీడియా పాత్ర ఎనలేనిది. ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకొని కొంతమంది క్రీడాకారుల(వారి ప్రేయసీ/ప్రియుల) వెంటపడటంకన్నా , మన పాఠశాలల క్రీడా పరిస్థితిని అధ్యనం చేసి వారి మద్య పోటీతత్వాన్ని పెంచే సర్వేలను నిర్వహించవచ్చు. ర్యాంకులతో ఊదరగొట్టే పాఠశాలల/కళాశాలలకు, క్రీడల/ఇతర కళాప్రదర్శనపై ఉన్న ఆసక్తిని బట్టి ర్యాంకులను ప్రకటించవచ్చు. సందర్భానుసారం ఇవికూడా తగినంత సంచలనాన్ని రేపుతుంది. విద్యాసంవత్సర ప్రారంభంలో ఇటువంటి వాటిద్వారా అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులూ మారుతారు. పిల్లలకు క్రీడల అవసరంపై/ప్రాధాన్యంపై ఇప్పటి తరానికి చెందిన తల్లిదండ్రులకు తగినంత అవగాహన వుంది కాబట్టి మనం అంతగా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు యంత్రంగాలకు తగిన సూచనలందించవచ్చు.

Friday, August 8, 2008

తెలుగు: మననం-మధనం

నేను-తెలుగు:


తెలుగుతో సాహిత్యంతో నా పరిచయం ఓం నమః శివాయః తో మొదలైంది. ఇక అప్పటినుండి ఆ ప్రస్థానం అలా సాగుతూనే వుంది.


రెండవ తరగతిలోనే నాకు ఓ మోస్తరుగా చదవటం వచ్చేసింది. మా నాన్న తెచ్చిన పుస్తకాలన్నిటినీ ఒకటిరెండు రోజుల్లో చదివి 'పారేసే' అలవాటు అప్పటినుందే మొదలైంది.


మూడవ తరగతినుంచి వార్తా పత్రికలు చదవటం మొదలెట్టాను. 'ఫాంటం' కథతో నాకు ఈనాడుతో సాన్నిహిత్యం మొదలైంది. 'టూకీగా', 'శ్రీధర్ ఇదీ సంగతి ' మొదటి పేజీ లో అప్పుడప్పుడూ కనిపించే పెద్ద కార్టూన్, ప్రధాన వార్థల హెడ్ లైన్స్, ఇలా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చేశాను. తదనంతర కాలంలో మరే పత్రికా నన్నింతగా ఆకర్షించ లేకపోయాయి. ఇక ఇండియా టుడే తెలుగులో వెలువడ్డ తరువాత నేను దానికి వీరాభిమానినైపోయాను.ఇదికాక చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి కథల పుస్తకాలు, యండమూరి, పానుగంటి, మధుబాబు నవలలు తెలుగుతో అనుభందానికి ఎంతగానో తోడ్పడ్డాయి.


ఇక చదువుల విషయానికి వస్తే, నేను పదవ తరగతి వరకూ తెలుగులోనే చదవగలిగాను. నా జీవితంలో పునాదులు పటిష్టంగా వుండటానికి ఇది ఎంతగానో ఉపకరించిందనటానికి సందేహం లేదు. ఇంగ్లీషు, హిందీ, సంసృతం లాంటి భాషలు నేర్చుకునేటపుడు నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కాని వాటి లోని వైవిధ్యాలను, సారూప్యతలను అర్థం చేసుకునే క్రమంలో నా మెదడు చురుకుగా తయారయింది. మనదేశ విద్యార్థులు ప్రతిభావంతులుగా మన్ననలందుకోవడానికి బహు భాషావిధానం ఒక కారణమని నేను గట్టిగా నమ్ముతాను.


తెలుగు - ఒక భాష:


దేశభాషలందు తెలుగు లెస్స అనీ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటుంటారు కాని అదెంతవరకూ నిజమో నాకు తెలియదు. కాని తెలుగులో అనేక ప్రత్యేకతలున్నాయి. చందస్సులు, సంధులు, సమాసాలు, విభక్తులు మన భాషకు రంగులద్దాయి. అవధానం తెలుగు సాహిత్య ప్రక్రియకే తలమానికం. ప్రస్తుతానికి ఏ కొద్దిమందొ అవధానాలను నిర్వహిస్తున్నా ఇది అవసాన దశలో వుందన్నది కాదనలేని నిజం.


తెలుగు - సమాజం:


ఇది పూర్తిగా నిస్పృహ కలిగించే విషయం. ఒక సంఘం గా మనమెపుడూ సంఘటితత్వాన్ని ప్రదర్సించలేదు. ఎక్కడైనా ఇద్దరు తెలుగు వారు వుంటే అక్కడ కనీసం మూడు ముఠాలుంటాయి. మనదేశంలో ఇద్దరు కల్సినపుడు ఇంగ్లీషు మాట్లాడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తెలుగు వారవటానికి అవకాశం చాలా వుంది. మరొక అవలక్షణం ఆత్మ నింద పర స్తుతి. ఇక పిల్లలకు మనం 'మమ్మీ డాడీ' సంస్కృతినే అలవాటు చేస్తున్నాం.


మనం మారాలి. మారటమంటే రోడ్లెక్కి సూచన పలకలను(సిగ్న్ బోర్ద్) తెలుగులోకి మార్పించటమో, ప్రాచీన హోదా కావాలనటమో, రీమేక్(పునఃనిర్మాణ) చిత్రాలకు అధిక పన్నులు వసూలు చేయాలని నిర్భందించటమో కాదు. మీ పిల్లలకు కనీస తెలుగును పరిచయం చేయండి. కనీసం వార్తా పత్రికలను చదివేంత అవకాశాన్ని కల్పించండి. ప్రాధమిక విధ్యలో తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగానైనా వుంచండి. ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి. బయటకూడా అవసరమైనంత వరకే ఇతర భాషలను ఉపయోగించండి.


మరొక్కటి మరువకూడదు, తెలుగును సమర్థించటమంటే ఇతరులను కించపరచొద్దు. తెలుగును మీకు అవకాశమున్నప్పుడల్లా మోతాదుకు మించకుండా వినియోగించండి.

గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనించండి.

Wednesday, August 6, 2008

ఆత్మవిశ్వాసమంటే ఇదీ..


నాగ నరేష్ అని ఒక కుర్రాడికి (కాకతాళీయంగా తెలుగు వాడు) ఈ మధ్య గూగుల్ లో ఉద్యోగం దొరికింది. దీనిలొ ప్రత్యేకత ఏంటంటే, చిన్న తనంలోనే ఒక ప్రమాదంలో రెండు కాళ్ళూ పూర్తిగా కోల్పొయినా పేదరికాన్ని జయించి అకుంఠిత దీక్షతో గూగుల్ దాకా చేరటం సామాన్యమైన విషయం కాదు.


మరొక ప్రత్యేకత ఏంటంటే అతనికి తన చుట్టు ఉన్న ప్రపంచం ఎంతో మంచిదిగా కనబడటం.. అతని మాటల్లోనే ఆ కథను చదవండి. (అనువదిస్తే భావం చెడుతుందేమోనని లంకెను వుంచుతున్నాను)

Tuesday, August 5, 2008

గర్భస్థ శిశువును ఎప్పటిలోగా చంపవచ్చు?

చట్ట ప్రకారం కొన్ని కారణాలపై 20 వారాల వరకు. యధా ప్రకారం చట్టం ఎంత కట్టుదిట్టంగా వ్రాయబడినా/వ్రాయ దలచినా మన పండితులు దానిలో కనీసం లక్ష లొసుగులను పట్టుకోగలరు. ప్రస్తుతానికి మన చట్టం గురించి అందులోని లోపాలగురించి చర్చింటం ఇక్కడ వుద్దేశ్యం కాదు.

సృష్టిలో మానవ జీవితంకంటే సంక్లిష్టమైనది మరొక్కటి లేదని నేను భావిస్తాను. మన సిరివెన్నల గారన్నట్లు 'నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా'. ఒక మనిషి సృష్టి అమ్మ నాన్నల విచక్షణతో(కొన్ని సార్లు నిర్లక్ష్యంతో, ప్రమాదవశాత్తూ) ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. కొత్త ప్రపంచంలోకి అడుగిడటానికి నిరంతరం శ్రమిస్తూ, శ్రమ పెడుతూ ఎంతో అయోమయంతో ఎదురుచూస్తుంటుంది. ఇంతటి అయోమయంలోనూ వెచ్చటి అమ్మ కడుపులో భరోసాగా చిందులేస్తుంది. అంతటి భరోసాతో వున్నప్పుడు ఒకరోజు అమ్మ(అప్పటికి తనకు తెలిసిన మరో ప్రాణం) తనను చిదిమేస్తే విలవిలలాడుతూ తనకు తెలిసీ తెలియకనే (మళ్ళీ తన ప్రమేయం లేకనే) ప్రాణాలు విడుస్తుంది. ఇదే విధంగా సాగుతుందా ఆ చిన్నారి ప్రాణి ఆత్మఘోష?

అమ్మ విషయానికి వస్తే, తనలాంటి మరో ప్రాణికి జన్మనివ్వబోతున్నాననే ఉద్విఘ్నతతో ఈ ప్రపంచాన్నే మరచిపోయి ఆ శిశువుతో కబుర్లాడుతుంటుంది. తన రక్తం పంచుకుని ఎదుగుతున్న ఆ చిన్నారిపై కోటి ఆశలు పెట్టుకుంటుంది. ఆ శిశువు యొక్క ప్రతి అణువూ తనలో ఎదుగుతూ చేస్తున్న ప్రతి కదలికనూ తనివితీరా ఆస్వాదిస్తుంది. తనలోని మరో ప్రాణానికోసం తన ప్రాణమైనా ఫణంగా పెట్టడానికి సిద్దమవుతుంది. ఇటువంటి క్షణంలో ఆ బిడ్డ పుట్టిన తరువాత ఎదో లోపంతో వుంటాడని(సాధారణ జీవితం గడపలేదని) తెలిస్తే ఆ తల్లి హృదయఘోష ఏ దేవునికి అర్థమవుతుంది? లోపంతో వున్న బిడ్డకు జన్మానివ్వాలో కడుపులోనే కడతేర్చాలో నిర్ణయించుకోవలసి వస్తే, ఎంతటి దారుణమీ సృష్టి?

ఇక సమాజం(ప్రభుత్వంతో సహా) దేనిని సమర్థించాలి? శిశువు ప్రాణాన్నా? చంపాలనే అమ్మ కడుపుకోతనా? ఎపుడు సమర్థించాలి 20 వారాల ముందైతే ఫర్వాలేదా? తరువాతైతే నేరమా? ఎలా? అదేదో చానెల్ వారన్నట్లు మన దేశ పరిస్థితులను(వికలాంగులకు అనువైన పరిస్థితులు, సరైన సప్పొర్టు సిస్టం మనదేశంలో లేవట) దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలా? లేక ఎన్నికలు జరిపి ప్రజాభిప్రాయం ప్రకారం నడచుకోవాలా?

ఎందుకీ సృష్టి, ఎవరికోసం ఇలా జరుగుతోంది? కడుపులోని పిండం అరొగ్యాన్ని గుర్తించగలిగే మానవుని పరిఙ్ఞానికి సంతసించాలా? అదే మానవుడు తనకు కావలసిన పరామితులతో పిండాన్ని సృష్టించగలిగే పరిణామాలను ప్రోత్సహించాలా? అటువంటి పరిస్థితి వస్తే ఎనాటికైనా ప్రపంచంలోని ప్రతి మనిషీ(మర మనిషి!) ఒకే జన్యు సూత్రంతో ప్రయోగశాలల్లో పుడతాదేమో? అమ్మ, నాన్నల అవసరం వుండదేమో? మరి మానవ జీవిత వైవిధ్యం ఏమవుతుంది? వైవిధ్యం లేకపోతే ఏమవుతుంది? అపుడెందుకీ సృష్టి? ఎవరు చెప్పగలరీ ప్రశ్నలకు పరిష్కారాలు(సమాధానాలు కాదు)?

నాకు మతి భ్రమించిందంటారా? నిజమేనేమో!! భ్రమించకపోతే నేను మనిషిని కానేమో!!