Friday, August 8, 2008

తెలుగు: మననం-మధనం

నేను-తెలుగు:


తెలుగుతో సాహిత్యంతో నా పరిచయం ఓం నమః శివాయః తో మొదలైంది. ఇక అప్పటినుండి ఆ ప్రస్థానం అలా సాగుతూనే వుంది.


రెండవ తరగతిలోనే నాకు ఓ మోస్తరుగా చదవటం వచ్చేసింది. మా నాన్న తెచ్చిన పుస్తకాలన్నిటినీ ఒకటిరెండు రోజుల్లో చదివి 'పారేసే' అలవాటు అప్పటినుందే మొదలైంది.


మూడవ తరగతినుంచి వార్తా పత్రికలు చదవటం మొదలెట్టాను. 'ఫాంటం' కథతో నాకు ఈనాడుతో సాన్నిహిత్యం మొదలైంది. 'టూకీగా', 'శ్రీధర్ ఇదీ సంగతి ' మొదటి పేజీ లో అప్పుడప్పుడూ కనిపించే పెద్ద కార్టూన్, ప్రధాన వార్థల హెడ్ లైన్స్, ఇలా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చేశాను. తదనంతర కాలంలో మరే పత్రికా నన్నింతగా ఆకర్షించ లేకపోయాయి. ఇక ఇండియా టుడే తెలుగులో వెలువడ్డ తరువాత నేను దానికి వీరాభిమానినైపోయాను.ఇదికాక చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి కథల పుస్తకాలు, యండమూరి, పానుగంటి, మధుబాబు నవలలు తెలుగుతో అనుభందానికి ఎంతగానో తోడ్పడ్డాయి.


ఇక చదువుల విషయానికి వస్తే, నేను పదవ తరగతి వరకూ తెలుగులోనే చదవగలిగాను. నా జీవితంలో పునాదులు పటిష్టంగా వుండటానికి ఇది ఎంతగానో ఉపకరించిందనటానికి సందేహం లేదు. ఇంగ్లీషు, హిందీ, సంసృతం లాంటి భాషలు నేర్చుకునేటపుడు నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కాని వాటి లోని వైవిధ్యాలను, సారూప్యతలను అర్థం చేసుకునే క్రమంలో నా మెదడు చురుకుగా తయారయింది. మనదేశ విద్యార్థులు ప్రతిభావంతులుగా మన్ననలందుకోవడానికి బహు భాషావిధానం ఒక కారణమని నేను గట్టిగా నమ్ముతాను.


తెలుగు - ఒక భాష:


దేశభాషలందు తెలుగు లెస్స అనీ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటుంటారు కాని అదెంతవరకూ నిజమో నాకు తెలియదు. కాని తెలుగులో అనేక ప్రత్యేకతలున్నాయి. చందస్సులు, సంధులు, సమాసాలు, విభక్తులు మన భాషకు రంగులద్దాయి. అవధానం తెలుగు సాహిత్య ప్రక్రియకే తలమానికం. ప్రస్తుతానికి ఏ కొద్దిమందొ అవధానాలను నిర్వహిస్తున్నా ఇది అవసాన దశలో వుందన్నది కాదనలేని నిజం.


తెలుగు - సమాజం:


ఇది పూర్తిగా నిస్పృహ కలిగించే విషయం. ఒక సంఘం గా మనమెపుడూ సంఘటితత్వాన్ని ప్రదర్సించలేదు. ఎక్కడైనా ఇద్దరు తెలుగు వారు వుంటే అక్కడ కనీసం మూడు ముఠాలుంటాయి. మనదేశంలో ఇద్దరు కల్సినపుడు ఇంగ్లీషు మాట్లాడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తెలుగు వారవటానికి అవకాశం చాలా వుంది. మరొక అవలక్షణం ఆత్మ నింద పర స్తుతి. ఇక పిల్లలకు మనం 'మమ్మీ డాడీ' సంస్కృతినే అలవాటు చేస్తున్నాం.


మనం మారాలి. మారటమంటే రోడ్లెక్కి సూచన పలకలను(సిగ్న్ బోర్ద్) తెలుగులోకి మార్పించటమో, ప్రాచీన హోదా కావాలనటమో, రీమేక్(పునఃనిర్మాణ) చిత్రాలకు అధిక పన్నులు వసూలు చేయాలని నిర్భందించటమో కాదు. మీ పిల్లలకు కనీస తెలుగును పరిచయం చేయండి. కనీసం వార్తా పత్రికలను చదివేంత అవకాశాన్ని కల్పించండి. ప్రాధమిక విధ్యలో తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగానైనా వుంచండి. ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి. బయటకూడా అవసరమైనంత వరకే ఇతర భాషలను ఉపయోగించండి.


మరొక్కటి మరువకూడదు, తెలుగును సమర్థించటమంటే ఇతరులను కించపరచొద్దు. తెలుగును మీకు అవకాశమున్నప్పుడల్లా మోతాదుకు మించకుండా వినియోగించండి.

గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనించండి.

5 comments:

చైతన్య.ఎస్ said...

తెలుగును సమర్థించటమంటే ఇతరులను కించపరచొద్దు. తెలుగును మీకు అవకాశమున్నప్పుడల్లా మోతాదుకు మించకుండా వినియోగించండి. చాలా బాగా చెప్పారు.

Naga said...

"మనదేశంలో ఇద్దరు కల్సినపుడు ఇంగ్లీషు మాట్లాడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తెలుగు వారవటానికి అవకాశం చాలా వుంది." అని చాలా చోట్ల చదివాను, కానీ నా అనుభవం మాత్రం వేరేగా ఉంది.

పక్కన ఇతర భాషల వాళ్ళు ఉన్నా, తెలుగులో మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.

అమెరికాలో కూడా ఇంగ్లీషు రాకుండా తెలుగులో మాత్రమే ప్రావీణ్యం సంపాదించిన పిల్లలు, ఇంగ్లీషు రానందుకు టీచర్లు కంప్లైంటు చేసిన కేసులు కూడా చాలానే ఉన్నాయి.

Kathi Mahesh Kumar said...

తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అనేది భాషా లక్షణాన్ని చూసి (మన పదాలు స్వరాలు- vowels తో ఇటాలియన్ భాషలాగా అంత మవుతాయి). దానికీ తెలుగు భాష గొప్పతనానికీ లంకె లేదు.

ఆత్మనిందకు,ఆత్మ పరిశీలనకూ గల తేడాకూడా గమనించడం అవసరం.

మీరు చాలా సార్వజనీకరణలు చేసారు. కాకపోతే గమనికలో మినహాయింపు కోరేసారు కాబట్టి.ఇక్కడ ప్రస్తావించడం లేదు.

Kranthi M said...

మనం మారాలి. మారటమంటే రోడ్లెక్కి సూచన పలకలను(సిగ్న్ బోర్ద్) తెలుగులోకి మార్పించటమో, ప్రాచీన హోదా కావాలనటమో, రీమేక్(పునఃనిర్మాణ) చిత్రాలకు అధిక పన్నులు వసూలు చేయాలని నిర్భందించటమో కాదు. మీ పిల్లలకు కనీస తెలుగును పరిచయం చేయండి.
అందరూ ఇది పాటిస్తే మన తెలుగు ఎక్కడికి పోతుందండి.అంతరించి పోవటం కాదు వెలిగి పోతుంది.చాలా మంచి విషయాన్ని చెప్పారు.మన తెలుగు వారందరూ ఈ విషయాన్ని గమనిస్తే మంచిది కదా?

పెదరాయ్డు said...

@చైతన్య: ధన్యవాదాలు.
@ నాగన్న: నిజం మీరు నమ్మాలి. కానీ కొంతమంది ఆ మాయలో పడలేదు. ఇక, మీరు చెప్పిన బాపతు అన్నిచోట్లా అప్పుడప్పుడూ తారసపడుతుంటారు. అందుకే అన్నాను మోతాదు మించకూడదని. అమెరికాలో కూడా ఇంగ్లీషు రాకుండా తెలుగులో మాత్రమే ప్రావీణ్యం సంపాదించిన పిల్లలు ఉన్నారంటే నమ్మటం కాష్టంగా వుంది. కాని ఇదికూడా తప్పే. అక్కడ వున్నప్పుడు ఇంగ్లీషు తప్పకుండా రావాలి. కాని తెలుగును మరచిపోకూడదు.

@కత్తి మహేష్: ఇటలీయన్ కు తెలుగుకీ ఇప్పుడే సంభందం తెలిసింది. ధన్యవాదాలు. ఆత్మ పరిశీలనకూ ఆత్మ నిందకూ విభజన రేఖ సన్నదే. జాగ్రత్తగా గమనించి మెలగితే చాలు. ఆ గమనిక పెట్టకపోతే మీరు నన్ను ఉతికేయరూ :)

@క్రాంతి: నెనర్లు.