Monday, July 14, 2008

భారత దేశం : పెళ్ళి- ప్రాతిపదిక

కొంతకాలంగా బ్లాగు లోకంలో భారతీయ (వివాహ) వ్యవస్థపై చాల విసుర్లు వినిపిస్తున్నాయి.
ఏన్నో విషయాలు చర్చకు వచ్చినా, భారత దేశంలో పెళ్ళికోసం ఎంచుకున్న ప్రాతిపదిక తప్పన్నట్లుగా ఇటివల ఒక ప్రముఖ బ్లాగావధానిగారు (విసురు కాదు సుమా!) అభిప్రాయపడటం నా దృష్టిని ఆకర్షించింది. వాటికి చాల ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడో చిన్న సందేహం నా మెదడును తొలచి నా మొదటి బ్లాగుకు ప్రేరణ అయింది. సదరు బ్లగావధానిగారి, చర్చ లోని కొంత సమాచారాన్ని వినియోగిస్తూ ఈ టపా కొనసాగిస్తాను. అన్యధా భావించక నా సాహసాన్ని ఆశీర్వదించ మనవి.
ఇక విషయానికి వస్తే, పెళ్ళికి ప్రధాన ప్రాతిపదికలుగా మూడింటిని ప్రస్తావించారు. 1. పరువు-ప్రతిష్ట 2. ఈడూ-జోడూ 3.డబ్బూ-దస్కం. నిజానికి ఇవేమీ అంత అనవసరపు విషయాలు కావు. మన పెద్దలు బాగానే అలోచించి ఏర్పాటు చేసిన ఒక విధానం. ఎవరైనా గుండెలమీద చెయ్యి వేసుకుని పెళ్ళికి పై మూడు ప్రాతిపదికలూ అనవసరమని చెప్పగలరా? సమస్యంతా వాటిని వక్రీకరించి(మన కోర్టు చట్టాల వలే) అమలు చేయటంలోనే వుంది.
1. పరువు-ప్రతిష్ట:
ఒక అమ్మాయిని, అబ్బాయిని ముడి పెడుతునపుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం వారిద్దరి జీవితంతో పాటు రెండు కుటుంబాల భవితవ్యం నిర్ణయించబడుతాయి. ఇరువురూ గత చరిత్రలను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. గత చరిత్ర భవిష్యత్తు ప్రవర్తనకు వర్తిస్తుందా అని ఎవరికైనా సందేహం రావచ్చు. కాని గత చరిత్రను పరిశిలిస్తే:), అధిక శాతం అలాగే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి కట్టుబాట్ల వల్ల ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో జాగ్రత్తగా ఉంటూ, ఎదైనా తప్పు చేయవలసి వచ్చినపుడు తమ భవిష్యత్తు గురించీ, తమ కుటుంబ/వంశ పరువు గురించీ ఒక్కసారయినా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన సంప్రదాయమది. గతంలో మన సమాజం చిన్నదవటం (జనాభాలో), అందరూ ఈ సూత్రానికి కట్టుబడి ఉండటం వల్ల, అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాలూ, బేరీజు వేసుకునే అవకాశం వుండేది. సమకాలీన ప్రపంచంలో ఈ కట్టుబాటును యధాతథంగా అనుసరించకుండా కాలానుగుణంగా జరిగిన పరిణామాలకు విలువనిస్తూ సందర్భానుసారం మూల కారణాన్ని అన్వయించుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు.
2. ఈడూ-జోడూ:
ఈడూ-జోడూ అంటే రూప లావణ్యాలనుకుంటే నిజంగా ఇది ఒక ప్రహసనమే. ఇవి కాలంతో బాటుగా క్షీణించే/అంతరించే విశేషణాలు. ఇక మనసు, ప్రవర్తన, గుణ గణాలు బేరీజు వేసుకుంటే, లోపాలు లేని మనిషెక్కడ? అసలు ఎదో ఒక లోపం లేని వాడు మనిషేకాదు, ఏ దేవుడో, దయ్యమో(దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళ కోసం) అయుండాలి. ఈడూ, జోడూ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరిని మరొకరు పూరించటమే. వీటికి రూప లావణ్యాలు సరి కుదిరితే పరిపూర్ణమే కానీ అవే పరమార్థమూ కావు, నిర్లక్ష్యం చేయవలసిన అంశమూ కాదు.
3.డబ్బూ-దస్కం:
డబ్బూ, దస్కం కూడా మంచి జీవనానికి అవసరమే. అంగీకరించటానికి ఇష్టపడక పోయినా, కష్టమైనా ఇది నగ్న సత్యం. మనిషి యొక్క గొప్ప ఆవిష్కరణలలో డబ్బు ఒకటి(ఈ పాయింటుపై ఎవరికైనా అభ్యంతరం వుంటే, మరెప్పుడైనా చర్చిద్దాం). కానీ పెళ్ళి తంతులో ఇది కట్నం గానో, కన్యాశుల్కం గానో రూపాంతరం చెందటం దురదృష్టం. పరిస్థితిని బట్టి ఇద్దరి సహజీవనానికి(సంతానంతో సహా) అవసరమయినంత ధనం సంపాదించగల సత్తా ఉందాని సరి చూసుకోవటం ఎంతమాత్రం తప్పు కాదు.
ఖచ్చితంగా ఇవే కాకపొయినా, ఇటువంటి ప్రాతిపదికలతో పాటు, వీటికి అనుసంధానిచబడిన వాటిలో, కొన్ని సందర్భాలలో లోపాలు కనిపించినా, లోపాలు లేకపొయినా పెద్దలు అలోచించి తమ విచక్షణాధికారంతో కొన్ని పెళ్ళిళ్ళను జరపటమో/ఆపటమో చేసేవారు. కొన్ని రహస్యాలను, తద్వారా కలిగే ఇబ్బందులనూ కొన్ని సందర్భాలలో వివరించక, చాల సందర్భాలలో వివరించ లేక(నిరక్షరాస్యత, పరిణితి లేమి లాంటి కారణాలతో), కొన్ని సూత్రాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేయించేవారు. కాల క్రమేణా అసలు వుద్దేశ్యాలు మరుగున పడినా ఇవి సంప్రదాయాలుగా స్థిరపడ్డాయి. చిత్తశుద్ది కలిగిన నాయకులున్న సమాజంలో ఇవి వ్యక్తిగత ఇష్టాలకు విలువనిస్తూ, సమాజహితాన్ని పరిగణలోకి తీసుకుని సరిగ్గానే అన్వయింప బడతాయి.
కాని, కాలగతిన ఇవి దుష్టుల(అధికారం, బలం, దౌర్జన్యం లాంటివి) పాలబడి వక్రీకరించబడి దుస్సంప్రదాయాలుగా పరావర్తనం చెంది ప్రస్తుత రూపంలో చెలామణి అవుతున్నాయి. దీనికి ప్రాతిపదికలను నిందించటం కన్నా (రచయిత యొక్క ఇతర అభిప్రాయలతొ ఏకీభవించినా, ఈ ఒక్క విషయం లోనే విభేదిస్తున్నాను) వాటి అసలు భాష్యాలను గ్రహించి మన పద్దతులను సాన పడితే వజ్రాల్లాంటి మన సంస్కృతి, సంప్రదాయాలు జీవం పోసుకుంటాయనడంలో సందేహం లేదు.
స్వయం సమృద్ది, విద్యార్జన, స్వయం ప్రతిపత్తి, స్వేచ్చ మొదలైన సుగుణాలు కలిగిన మనం (మన ప్రస్తుత భారత సమాజం) కాస్త వివేచనతో పాశ్చాత్య సంస్కృతి లోని కొన్ని జాడ్యాలను వంటపట్టించుకోక మన సంస్కృతి నేర్పిన కట్టుబాట్లకు గౌరవమిస్తూ అవసరమైనప్పుడు సమీక్షిస్తూ ముందుకు పోతే మనం మనిషి భవిష్యత్తుకు అద్వితీయమైన వారధి కావచ్చు.
గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనిచగలరు.
ఈ టపాలో ఉదరహరించబదిన టపాకు లంకె: http://parnashaala.blogspot.com/2008/07/blog-post_11.html

11 comments:

తెలుగు'వాడి'ని said...

పెదరాయ్డు గారు : మరో కోణంలో వివరించటానికి ప్రయత్నం చేశారు. అభినందనలు.

నేను ఇదే విషయంపై, ఇదే కోణంలో టపా రాయటం కొంచెం ఆలశ్యం చేయటం కూడా మంచిదే అయ్యింది అనిపిస్తుంది ఇప్పుడు. చాలా వరకు స్పష్టత తీసుకు రాగలిగారు అనిపించింది.

మీ టపా ఇంకా కొంచెం వివరంగా ఉండే బాగుండేది అనిపించింది. ఫర్వలేదులేండి నేను ప్రయత్నిస్తా .. చూద్దాం చెప్పగలనో లేదో ...

Anil Dasari said...

ఇవే ప్రశ్నలు నే లేవనెత్తితే మరునాడు వాటిని అపహాస్యం చేస్తూ కవితల్లాడు సదరు బ్లాగావధాని. చూడబోతే నేనేదో సనాతనభావాలకు ప్రతినిధిని అన్న కోణంలో నామీద దాడి మొదలయినట్లుంది.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు;మీరు చెప్పిన
"కాలానుగుణంగా జరిగిన పరిణామాలకు విలువనిస్తూ సందర్భానుసారం మూల కారణాన్ని అన్వయించుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు"

"ఈడూ, జోడూ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరిని మరొకరు పూరించటమే"

"పరిస్థితిని బట్టి ఇద్దరి సహజీవనానికి(సంతానంతో సహా) అవసరమయినంత ధనం సంపాదించగల సత్తా ఉందాని సరి చూసుకోవటం ఎంతమాత్రం తప్పు కాదు"

నిజంగా ప్రస్తుతం జరుగుతున్న విధానాలలో ఇవి ఆలోచిస్తున్నారంటారా? ప్రస్తుతం ఇది కేవలం ఒక ritualism గా మిగిలి ఆలోచన కొరవడింది కనుకనే "డొల్లతనం" అన్నాను. కాలానుగుణంగా మారడంయొక్క అవసరాన్ని ఎత్తిచూపాను. I am not talking a moral stand. I am seeking to improve upon existing system if you believe its doubtful.

లేదూ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ భేషుగ్గా ఉందంటే చక్కా ఫాలో అయిపోవడమే!

ప్రస్తుత కాలంలో, సాంప్రదాయాల పేరుతో పెళ్ళి వ్యవస్థలో పెరుగుతున్న hypocrisy ని నేను ఎత్తిచూపడానికి ప్రయత్నించాను.దాన్ని అర్థవంతం చెయ్యడం యొక్క అవసరాన్ని ఎత్తిచూపాను. మీరూ అదే చెబుతున్నారు. కాకపోతే,"తప్పే కానీ తప్పదు కదా" అన్నట్టుంది అంతే!

పెదరాయ్డు said...

@తెలుగు'వాడి'ని: నెనర్లు. మీ సలహాను పాటిస్తాను. మీ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు.
@ అబ్రకదబ్ర: దాడులకు వెరవకండి. వాటిని సోపానాలుగా మలచుకొని మీ వాదనకు పదును పెట్టండి.
@కత్తి మహేష్ కుమార్ : తప్పే కానీ తప్పదు కదా అంటే ఈ టపా అవసరమే లేదు. నేను చెప్పదల్చుకున్నది తప్పు ప్రాతిపదికది కాదు, దాన్ని అమలుచేస్తున్న విధానమని.

Krishna K said...

మన వ్యవస్థ లో, ఎదో, పెద్ద లోపాలు ఉన్నాయి అనటం, వాటిని ఎదో మార్చెయాలనటం, ఈ రోజులలో, అది బ్లాగ్ ల్లో కానీయండి, వెరేచోట కానీయండి, పెద్ద fashion అయిపొయింది. వ్యవస్థ అన్నాక గొప్పలు ఎలా వుంటాయో, లోపాలు అలానే వుంటాయి. కాకపొతే మన వివాహ వ్యవస్థ వున్నంతలో, కాస్త మెరుగు అయినదే అన్నది, ఒక ఇండియనే కాకుండా, వెరే వివాహ వ్యవస్థలు చూసిన వాడి గా నా అభిప్రాయం. ఎంత మంచి వ్యవస్థ నయినా, కొందరు వాళ్ల స్వార్ధానికి అమలు చేసుకోవటం, సాధారణమే. అంత మాత్రాన, మన వివాహ వ్యవస్థ కాలం తో పాటు, మారట్లేదనుకోవటం, దానికోసం ఎదో చేసేయాలనుకోవటం మాత్రం అవివేకమే. ఇది మీ బ్లాగ్ మీద కామెంట్ మాత్రం కాదు సుమా.

Sujata M said...

కృష్ణ గారు. ఫేషన్ విషయానికొస్తే.. వరకట్నం పెనుభూతం. దాన్ని వ్యతిరేకించడం.. ఫేషన్. ఏదయినా ముందే నిర్ణయించిన పద్ధతుల (సాంప్రదాయం) ప్రకారం జరపకపోతే, వాటిలో లోపాలను ప్రశ్నిస్తే, ఫేషన్. ఇంకోలా అనుకోవద్దు. నిజానికి కొన్ని ఇలాంటి రకాల ఫేషన్లనే అభుదయవాదం అంటారు. ప్రజలలో అవరెనెస్ కలిగించె ఈ ఫేషనే లేక పోతే, సతీ సహగమనం ఇంకా వ్యాప్తి లో ఉండేది. కిరసనాయిలు పోసి కొత్త కోడళ్ళను నులువునా దహించడం కూడా, కామన్ అయి ఉండేది.

Sujata M said...

నిజానికి, ఏ మతానికి చెందిన వారికి, ఆయా మతాచారాల పట్ల గౌరవం ఉంటుంది. అనాగరికత అని నాకు (ఇది వరకటి బ్లాగావధాని గారి బ్లాగ్ లో నేనూ వ్యాఖ్యానించాను) అనిపించినది, ఇప్పటికీ సంబంధాలు చూడటం పేరిట, అమ్మాయిల ఇళ్ళ మీద అబ్బాయిల కుటుంబాల ఇన్స్పెక్షన్ ల లాంటి దాడులు, కట్నం డిమాండులూ (అమ్మాయీ, అబ్బాయీ పేరిట జాయింటు అకౌంట్ లో కట్నం వెయ్యండి - అంటూ కొత్త రెలాక్సెషన్ లూ), ఆడపడుచు లాంచనాలు, ఇవన్నీ.. ఇద్దరు పూర్తిగా కొత్త వ్యక్తుల మధ్య జరిగే పెళ్ళి పెత్తనాలు. వీటికి నిజంగా బాధితులు ఉన్నారు. ఈ బాధ భరించలేక, అన్ని అర్హతలూ ఉన్నా, కులం, జాతకం లాంటి ఉచ్చులలో పడి, ఎందరో పెళ్ళి చేసుకోలేకపోతున్న అమ్మయిలు ఉన్నారు. వీటిని చేదించలేకపోవటం అనాగరికం. సనాతన వాదం ఒప్పే. కానీ మన చేతల వల్ల, చాందసత్వం వల్ల, ఇతరులకు నష్టం కలగనంత వరకూ ఏదైనా మంచిదే. ఈ సిస్టం అలా కరుడుగట్టుకుపోవటం, ఎప్పటికైనా మారాలి. అంతే-నేను చెప్పదలచుకున్నది. నాకు కూడా చాలా వ్యతిరేకత ఎదురైంది. కానీ, ఎవరి అభిప్రాయాలు వారివి. అందులో గొడవేముంది ?

Sujata M said...

ఇంకో మాట - మీ పేరు, మీ బ్లాగు పేరు కాంబినేషన్ బావుంది. ఏదో సరదాగా పెట్టేరనుకున్నాను. బానే రాసారు సీరియస్ విషయాన్ని. వెల్ డన్.

Anil Dasari said...

సిస్టంలో తప్పులు దిద్దటానికి ప్రయత్నించటం మంచిదే. పాత భావాలనే పట్టుకుని వేలాడమని ఎవరూ అనరు. సమస్యల్లా, ప్రతి విషయాన్నీ భూతద్దంలోనుండి చూడటం. అక్కడ (ఆ బ్లాగులో) తప్పులు ఎత్తి చూపే ప్రయత్నంకన్నా తప్పులు ఎంచే ప్రయత్నం ఎక్కువ కనిపిస్తుంది. లేకపోతే ఒడ్డు-పొడుగు, ఈడు-జోడు లాంటి compatibility factors పట్టించుకోవటం కూడా తప్పే అన్నట్లు వ్యాఖ్యానించటమేమిటి? 'మనం మాత్రం అవన్నీ పట్టించుకోకుండా పెళ్లిళ్లు చేసుకున్నామా' అంటే పద్యాలతో సెటైర్లు వెయ్యటం! చర్చ కట్నానికి, పెళ్లయ్యాక అమ్మాయిలపై జరిగే డొమెస్టిక్ వయొలెన్స్ కి సంబంధించినదైతే అర్ధవంతంగా ఉండేది.

Krishna K said...

సుజాత గారు,
నేను fashion అని కామెంట్ చేసింది వేరు, మీకు అర్ధం అయ్యింది వేరు. కామెంట్ క్లుప్తం గా వ్రాయటం వలన వచ్చిన ఇబ్బంది అది. ఇక పొతే కట్నాలను ఖండించవలిసిందే. ఇంటి మీదకు పెళ్లిచూపుల పేరు తంతు తో , గుంపులు గుంపులు వచ్చి పడటం కూదా రోతే. కాకపొతే పంచాయితీ వారో, నాలాంటి వాళ్లొ దానిని సనాతన పేరు తో సమర్ధిస్తున్నాన్ అని మీరు అనుకోంటే మాత్రం, మీ అపొహే. అవి దురాచారాలు. అవి ఏ రూపం లో వున్నా మనం అందరం వాటిని రూపు మాపాల్సిందే. దానికి అభ్యుదయవాదులమనే బిరుదులు అక్కర్లెదు. నా వరకు విలువలు నిజ జీవితం లో పాటించే వాళ్లు ఆదర్శవాదులు. నాకు తెలిసినంతవరకూ ఆదర్శవాదులు పెరుగుతున్నారే కాని, తగ్గటం లేదు. అదే జరిగుతున్నట్లు అయితే, మీరు అన్నట్లు మనం ఇంకా సతీ సహగమనం రోజులలోనే వుండే వాళ్లం.

నేను అన్న fashion వాళ్ల గురించి చెప్పాలంటె, తలకి చుండ్రు పడుతుంది కాబట్టి, తల మీద వెంట్రుకులది తప్పు అని రంద్రాన్వెషణ చేసే వాళ్ల గురించి. సహజం గా ఇలాంటి వాళ్లకు ఎక్కడో అసంత్రుప్తి వుండి (అది వేరే కులం లో నో, సమాజం లోనో పుట్టలేదనో, ఆ మాటకు వస్తే వెరే subject చదవలెకపోయామనో ఇలా) ఇలాగ, బయట పడుతూ వుంటుంది. ఇల్లాంటి వాళ్లకి మాత్రం ఎప్పుడూ glass half EMTY నే, వాళ్లకు లబ్ది గుర్చే విషయాలలో తప్ప.

ఉదాహరణకు వీళ్లకు శిక్ష కులాల అధారం గా వేయటం లో, చట్టాలను కులాల అధారం గా, చేయటం లో డొల్లతనం మాత్రం కనబడదు. మిగతా అన్ని విషయాలలో మాత్రం వివాహ వ్యవస్త దగ్గర నుండి, రాఘవేంద్ర రావ్ వరకు మాత్రం డొల్ల తనం నిత్యం కనబడుతునే వుంటుంది. నేను అన్న fashion అన్న పదం ఇలాంటి మానసిక రుగ్మత వున్న వాళ్ల గురించి.

పంచాయితి గారు, మీ బ్లాగ్ లో అనవసరం గా దూరాను అనుకొంటే క్షమించండి.

పెదరాయ్డు said...

@కృష్ణ: మీతో ఏకీభవిస్తాను. ఈ పంచయితీలో వాద ప్రతివాదులందరూ ధీటుగా వారి వాదనలు వినిపించవచ్చు. మీ చర్చ సహేతుకమే..
@సుజాత: నా బ్లాగు పేరు నచ్చినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లు, కొన్ని అనాగరిక సాంప్రదాయాలు మన సంస్కృతిలో కొనసాగుతున్నాయి. శతాబ్దాలుగా వేళ్ళూనుకుపోయిన కొన్ని దుస్సంప్రదాయలు తుడిచేయటానికి మన శక్తి మాత్రమే చాలదు. కాకపోతే మన తరువాతి తరాలకు కొన్నింటిని సవరించి అందించవచ్చు. సమూల/సత్వర మార్పులను ఆశించటం కష్టమే, వాటిని మన సమాజం భరించే స్థితిలో వుండదు. మీరు ప్రస్తావించిన పెళ్ళీ చూపుల తతంగం గురించి మరోసారి చూద్దాం. మన విలువల అర్థాన్ని తెలుసుకుని ఆచరించగలిగితే ఎన్నటికైనా మీ కల నెరవేరుతుందని హామీ ఇస్తున్నాను.

అబ్రకదబ్ర : శాంతించండి :) సమాజంలో అన్ని రుచులూ ఉంటేనే మజా వుంటుంది.