Sunday, July 27, 2008

ఉగ్రవాదం - ఎలా నియంత్రించటం?

ఈ ప్రశ్న ఆలోచించవలసింది ఎవరు?

పోలీసులా, దేశనేతలా, సైనికులా, ఉపాధ్యాయులా, తల్లి తండ్రులా, మొత్తం ప్రజానీకమా? ఎవరు దీనికి భాద్యులు? ఎందుకిలా చేస్తున్నారు? ఏమిటి దీనికి పరిష్కారం? పోలీసులు, మన నిఘావ్యవస్థ దీన్ని నియంత్రించ గలుగుతుందా? నియంత్రిస్తే ఎంతవరకు నియంత్రించగలుగుతుంది?

ప్రజలకు(మనలోని ప్రతిఒక్కరికీ) తమమీద తమకు నియంత్రణ లేకపోతే పోలీసులేకాదు, ఆ దేవుడే దిగివచ్చినా పూర్తిగా ఇటువంటి అఘాయిత్యాలను ఆపడం కష్టం.

మొదట ఇటువంటి హింసాత్మక చర్యలకు కారణమేంటంటే, సమాజం మీద కాని, సమాజం లోని ఒక భాగం మీద కాని అనేక కారణాలతో కసి పుట్టిన కొంతమంది ఇతరులపై దాడికి తెగబడటం. దురదృష్టవశాత్తూ వీరు గతంలో అణగదొక్కబడినవారుగా గానీ, అణగదొక్కబదుతున్నారని భావిస్తున్న వారుగా గాని వున్నారు.

మన దేశానికి సంభందించినంత వరకూ, నక్సలైట్లూ, ఇతర విప్లవ గ్రూపులు, విదేశీ ఉగ్రవాదం కారణాలుగా ఉన్నాయి. గతంలో, మన సమాజనిర్మాణం, వృత్తులను బట్టి వివిధ కులాలుగా విభజింపబడ్డాయి. కాని వీటిలో అగ్ర, నిమ్న కులాలని మరో విభజన తేవడం ద్వారా సాంఘిక అసమానతలకు తద్వారా కొన్ని దురాచారాలు ఏర్పడి సమాజం లోని ఒక భాగం అణగద్రొక్కబడింది. ఇటువంటి విభజనలు ఈ ప్రపంచంలోని ప్రతి సమాజంలోను వున్నాయి. ఇవి ఇలాగే కొనసాగినంత వరకూ ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదు. కాని, కొంతమంది పెద్దలు ఈ అసమానతలను గుర్తించి చక్కదిద్దటం మొదలు పెట్టి, సమాజం మార్పు చెందటానికి సిద్దపడుతున్న తరుణంలో సదరు అణగద్రొక్క బడిన వర్గంలోని కొందరు గతంలో జరిగిన అన్యాయాలకు పగ తీర్చుకోవాలని భావించినపుడే ఇటువంటి ఉగ్రవాద చర్యలకు ఆస్కారం ఏర్పడుతుంది(ఇటువంటి భావనకు, కొంతమంది నన్ను నిందించవచ్చు కాని, ఇది అంగీకరించవలసిన విస్మరించలేని నిజం). ఇటువంటి పగ వున్నవారు, తమకు అనుకూలమైన వాతావరణం కనుపించగానే, అవకాశం దొరికినప్పుడల్లా, ఎదుటివారికి వారిలాగానే అన్యాయం తలపెడతారు. దీనితో ఇటువైపు వర్గం వారి అహం దెబ్బతిని ప్రతిచర్యలకు దిగుతారు. దీనివల్ల సదరు విద్వేషాలు పెరుగుతాయే కానీ, పరిష్కారం ఎక్కడ? ఇద్దరిలో వున్న తేడా ఏంటి? ఎదుటివారిని, వారి పూర్వపు చర్యలను నిందించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బలం పెరిగినప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా వున్నపుదు, వారిని క్షమించు. నీకు అన్యాయం చేసినవారు పశ్చాత్తాపంతో దహించుకుపోవటమే కాదు, మళ్ళీ ఏ సందర్భంలోనూ అటువంటి తప్పులను పునరావృతం కానివ్వరు.

వైరాగ్యంగా అలోచిస్తే, అసలు ప్రపంచంలో, ప్రకృతిలో అసమానతలు లేని ఒక సందర్భం ఏది? ప్రకృతిలోని ఏ రెందు వస్తువులు కాని, విషయాలు కాని, వ్యక్తులు కాని ఒకటెలా అవుతాయి? అంతెందుకు, మన చేతిలోని ఐదు వేళ్ళు సమానం కావే!! ఎడమకంటికి కుడికంటిమీద కోపం వస్తే ఎలా? కుడికంటికి ఆధిక్యభావం వుంటే అది అర్థరహితం కాదా? సృష్టిలోని ఏ రెండు ఒక్కటి కాజాలవు. రెండు ఒక్కటి కాగలిగితే ఆ సృష్టే అనవసరం. దేనికదే వైవిధ్యంగా వుండవలసిందే. కాని సమస్య ఎక్కడంటే, ఏ ఒక్కదాన్నొ అధికంగానో, అధమంగానో భావించటమే. ప్రతి సృష్టికీ దేనికదే ఒక ప్రత్యేకత, పరమార్థం వుంటుంది. మనం దానిని గమనించి నడచుకోగలిగితే చాలా వరకు అసమానతలు తొలగిపోతాయి.


ఇక ఆచరణా మర్గానికి వస్తే,
1. ఇంట్లో

  • భర్త, భార్యని గౌరవించాలి. ఒకరినొకరు అవమానించే సందర్భాలను తగ్గించుకోవాలి.
  • కొడుకుకూ, కూతురికీ మద్య పెంపకంలో వివక్ష చూపొద్దు.
  • పిల్లల మద్య నున్న అసమానతలను కించపరచవద్దు.
  • కోడలికీ, కూతురికీ/కొడుకుకూ వివక్ష చూపొద్దు.
  • అత్త మామలకు, తల్లిదండ్రులకూ భేదం చూపొద్దు.
  • పిల్లలకు క్షమాగుణాన్ని, ఓర్పును, పెద్దల పట్ల మర్యాదను నేర్పండి.

2. ఇంటిబయట
  • పిల్లలకు, కుల/మత సంభందమైన విభేధాలను నేర్పించకండి(కనీసం పాఠశాల వయస్సులో) . ఈ విషయంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది.
  • ఎదుటివారిని కించపరచడాన్ని తమాషాగా కూడా చేయవద్దు/ప్రోత్సహించవద్దు.
  • ఇటువంటి సందర్భాలెదురైనప్పుడు లౌక్యంగా తప్పించుకునే మార్గాలను నేర్పండి/నడచుకోండి.
  • విషమ పరిస్తితుల్లో ఆవేశం కాకుండా ఆలోచనను అలవాటు చేసుకోవటం.
పై మార్గాలు అల్లోపతిలా తక్షణ పరిషారం కాకపోయినా, ఆయుర్వేదంలా దీర్ఘకాలంలో స్థిరమైన ఫలితాలనివ్వగలవు.

తుదిపలుకు: క్షమించటమంటే, అణగారి ఉండటం కాదు, ధైర్యాన్ని ప్రదర్శించి ఆత్మబలాన్ని చూపించి ఎదుటివారికి హాని తలపెట్టకపోవటం.

గమనిక: నా అభిప్రాయాలలో ఏవైనా సార్వజనీకరణకు(generalization) గురై వుంటే, వాటిని కేవలం మెజారిటీగా గుర్థించగలరు. ప్రతి సూత్రీకరణకూ కొన్ని మినహాయింపులుండగలవని గమనిచగలరు.

1 comment:

Anonymous said...

good post. I agree that if we grow people with moral values then can bringa change