అభినవ్ కు అభినందనలు.
అభినవ్ ఒక మంచి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. మన దేశ స్థాయితో పోల్చుకుంటే అతడు సాధించింది అపూర్వం, అనితర సాధ్యం. కాని అతని ప్రవర్తనలో ఆ స్తాయి గర్వం కనిపించలేదు. నింపాదిగా తన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. పిచ్చిగంతులు వేయలేదు. అవసరానికన్నా కొంచం తక్కువగానే స్పందిచాడు. పెద్దగా సంచలన వ్యాఖ్యలేవీ చేయలేదు. తన విజయగర్వంకంటే భవిష్యత్తులో భారత విజయగీతికనే అకాంక్షించాడు. తన విజయం ఇతరుల్లో స్పూర్తి రగిలించాలని కోరుకున్నాడు.
మరో ప్రతిభాశాలిని మునగచెట్టెక్కించేందుకు కలిగిన సదవకాశానికి(సంచలనానికి) గండిపడటం మీడియాకు రుచించక పోయినా, ప్రస్తుతం ఈ నిగ్రహాన్ని విజయాన్ని కలగలిపి అతడిని మునగచెట్టు ఎక్కించటానికి విపరీతంగా శ్రమిస్తున్నారు.
ఒక పుట్టు సంపన్నుడిగా(భారతంలో చాలా సార్లు ఇది నేరంతో సమానం), ఉన్నత విద్యావంతుడిగా, ఒక సంస్థకు అధిపతిగా ఇటువంటి భావోద్వేగాలకు, నడమంత్రపు సిరి కలిగించే ఉన్మత్తానికి అతీతంగా వుండగలడనే ఆశిద్దాం. డబ్బు అతనికి కొత్తేమీ కాదు కాని కొత్తగ వస్తున్న కీర్తి శిఖరంతోనే జాగ్రత్తగా మెలగాలి.
లేకపోతే మనం సానియా, కాంబ్లి, మల్లీశ్వరి, రాథోడ్ లాగా ఆణిముత్యాలను కోల్పోవలసి వస్తుంది. అప్పుడప్పుడు కనిపించే ఈ మెరుపులను ఒడిసిపట్టి మన నైపుణ్యాలకు సాన పట్టాలే గాని, వారిని తేరుకోలేనంత ఉద్విఙ్ఞానికి, అందుకోలేనంత ఎత్తుకూ తరిమేసి, విఫలమైనప్పుడు అగాధానికి తొక్కేయటం సబబు కాదు.
అభినవ్ కు వచ్చి పడుతున్న ప్రశంసలు, బహుమానాలు మంచిదే కాని, వాటిని గుత్తగుంపగా అతనొక్కడికి మాత్రమే అంచించకూడా తగినన్ని నిధులు ఏర్పాటు చేసి ఇతర క్రీడలకూ వసతులు, సాంకేతిక సహకారాన్ని పెంచాలి. ఇటువంటి సందర్భాలలో, అతణ్ణీ తగురీతిలో సత్కరించటంతో పాటు, అతనీ క్రీడా విభాగానికీ(వీలును బట్టి ఇతర క్రీడలకూ) తగినంత వసతులు కల్పించాలి. ప్రస్తుతం అనేకమంది చిన్నారులు అతని విజయంతో స్పూర్తి పొంది వుంటారు. ఈ వాతావరణాన్ని మనం సొమ్ము చేసుకోవాలి. క్రీడలకు సంభందించిన వసతులను అక్కడక్కడా ఏర్పాటు చేసి, శిక్షణనివ్వాలి, మెరికలను గుర్తించి మెరుగు పరచాలి. ఈ స్పూర్తితో అందరినీ కనీసం ఒకమెట్టు అధికంగా ఎక్కేందుకు ప్రోత్సహించాలి. పాఠశాలల్లో తగినంత వసతులు కల్పించి పోటీ వాతావరణాన్ని కలిగించాలి.
ఎటువంటి స్పూర్తినైనా, ఎంతటి ఉత్తేజాన్నయినా నిర్వీర్యం చేసే శక్తి సామర్థ్యాలు మన రాజకీయనాయకులకు (రాజకీయ)ఉగ్గుపాలతో నేర్చిన విద్య. ఎక్కడైనా డబ్బులుగానీ, ఓటు బ్యాంకు గాని కనిపిస్తే దాన్ని పిండి చేసి పిప్పితీసేవరకూ వారు నిద్రపోరు. ప్రస్తుతం హాకీ, క్రికెట్టుకి పట్టిన/పడుతున్న దుర్గాతి వారి నిర్వాకం ఫలితమే.
ఇటువంటి సందర్భంలో మీడియా పాత్ర ఎనలేనిది. ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకొని కొంతమంది క్రీడాకారుల(వారి ప్రేయసీ/ప్రియుల) వెంటపడటంకన్నా , మన పాఠశాలల క్రీడా పరిస్థితిని అధ్యనం చేసి వారి మద్య పోటీతత్వాన్ని పెంచే సర్వేలను నిర్వహించవచ్చు. ర్యాంకులతో ఊదరగొట్టే పాఠశాలల/కళాశాలలకు, క్రీడల/ఇతర కళాప్రదర్శనపై ఉన్న ఆసక్తిని బట్టి ర్యాంకులను ప్రకటించవచ్చు. సందర్భానుసారం ఇవికూడా తగినంత సంచలనాన్ని రేపుతుంది. విద్యాసంవత్సర ప్రారంభంలో ఇటువంటి వాటిద్వారా అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులూ మారుతారు. పిల్లలకు క్రీడల అవసరంపై/ప్రాధాన్యంపై ఇప్పటి తరానికి చెందిన తల్లిదండ్రులకు తగినంత అవగాహన వుంది కాబట్టి మనం అంతగా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు యంత్రంగాలకు తగిన సూచనలందించవచ్చు.
2 comments:
మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు.
మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు.
Post a Comment