Friday, July 18, 2008

అణు ఒప్పందం - శ్వేత పత్రం

ఈ వ్యాసాన్ని వీలయినంతవరకూ అంకెలు, సాంకేతిక పదాలతో నింపకుండా అందరికీ అర్థమయ్యేవిధంగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
అణు ఒప్పంద లాభాలు:
  • అణు ఇంధన సరఫరా కూటమి(NSG) ద్వారా, భారత్ కు ఇంధన సరఫరా.
  • అణు విద్యుత్ ఉత్పాదనకు కావలసిన పరికరాలు.
  • క్రొత్త అణు విద్యుదుద్పాదన కేంద్రాల ఏర్పాటు. తద్వారా కలిగే ఉపాధి అవకాశాలు.
  • అమెరికాతో స్నేహం పెరుగుతుంది(ఇది లాభమా నష్టమా అన్నది మీ అలోచనకే విడిచిపెడుతున్నాను).
అణు ఒప్పంద పరిమితులు:
  • నిరంతర సరఫరాకు హామీ లేదు.
  • సాంకేతిక పరిఙ్ఞాన బదలాయింపు లేదు.
  • పరికరాలను NSG నుంచే కోనుగోలు చేయాలి.
  • మిగిలిన దేశాలతో పొలిస్తే IAEA తనిఖీ పరిధి లోకి వచ్చే కేంద్రాలు భారత్ లో అధికం.
  • భారత దేశానికి అణుశక్తి హోదా లేదు, కనుక రక్షణ పరిశోధలమీద అప్రకటిత నియంత్రణ వర్తిస్తుంది.
  • హైడ్ చట్టం ద్వారా, అమెరికాకు, అణు సరఫరా కూటమిని నియంత్రించే(భారత్ విషయంలో) ఏకపక్ష అధికారం.
అప్రకటిత అంశాలు:

1. భారత్/అమెరికా లు అణు పరీక్షల పై ఎటువంటి హామీ ని ఇవ్వక/పొందక పోయినా, భారత్ కు అణు హోదా ఇవ్వక పోవటం గమనార్హం. ఇది పౌర అణు ఒప్పందం మాత్రమే అని ప్రభుత్వం వాదిస్తోంది. కాని ఇది మనకు అప్రకటిత నైతిక ఆంక్షలను వర్తింప చేస్తుంది.
2. IAEA ముసాయిదాలోని 'దిద్దుబాటు చర్య ' ఏమిటో వివరణ లేదు. ఇది రెండువైపులా అపోహలకు తావిచ్చే అంశం.
3. మన దేశం లోని ధోరియం నిల్వలను వినియోగించేందుకు పరిశొధనలు జరుగుతున్న సమయంలో, అనేక సంక్లిష్టతలతో కూడిన యురేనియం దిగుమతికి ఇంత తొందర అవసరమా? యురేనియం దిగుమతికి కొన్ని వేల కోట్లు పెట్టుబడి, మన దేశీయ పరిశోధనలపై వెచ్చించే మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
4. మన ప్రభుత్వ అత్యుత్సాహం and over optimism.

పరిశీలనాంశాలు:

ఈ ఒప్పంద విషయంలో అమెరికా కనబరుస్తున్న అమితాశక్తిని, మన నేతలు (ముఖ్యంగా మన్మోహన్ గారు) ఎంతవరకు అర్థం చేసుకున్నారు. అమెరికాకు వేల కోట్ల డాలర్ల వాణిజ్య ప్రయోజలే ప్రాతిపదిక ఐతే పెద్ద నష్టం లేదు కానీ, దీన్ని అవకాశంగా రాజకీయంగా మనల్ని కట్టడి చేయాలని చూస్తే మనం ఎంతవరకూ సన్నద్దంగా వున్నాం?

ఎన్నో దేశాలకు అవసరార్థం సహాయం చేసి, వారిని రాజకీయంగా తన కను సన్నల్లో నడిపించుకున్న,నడిపించుకుంటున్న అమెరికాను మనం ఎంతవరకూ విశ్వసించగలం?

అణు ఒప్పందం లాంటి కీలక విషయాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేసి రాజకీయ పరిణామాలను చర్చించి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించి వుండవచ్చు. ఎన్నో విషయాలలో ఇటువంటివి జరిగాయి. వామపక్షాలను వదిలేస్తే, ప్రతిపక్షం కూడా ఒప్పదాన్ని పూర్తిగా వ్యతిరేకించక పోవడం ఇక్కడ గమనార్హం. అలాగే ఒబామా బుష్ కు మద్దతు తెలపడం విశేషం.

ఇక మన్మోహన్ గారి విషయానికొస్తే, దేశ భక్తి, నిబద్దత విషయంలో శంకించక పోయినా, రాజకీయ పరిణితి లోపించిందని అనుమానంగా వుంది. సోనియా సహాయం లేకుండా కాంగ్రెస్ రాజకీయాలనే అర్థం చేసుకోలేని ఆయన, బుష్ చూపిన కొద్దిపాటి సాన్నిహిత్యానికే ఆయనను మంచి నేతగా మన శ్రేయోభిలాషిగా ఒకానొక సందర్భంలో కొనియాడారు. తనపై వస్తున్న అసమర్థ ప్రధాని అనే మచ్చను చెరిపేసుకోవటానికి ఆయన మొండిగా దీనికోసం ఎగబడితే మాత్రం మన పూర్వపు నేతల కష్టంతో పాటు, భవిష్యత్తు నాశనమవుతుంది.

మనం కోరగలిగిన సవరణలు:

1. ఆణుశక్తి దేశాలకు వర్తించే నియమాలను పొందుపరచటం(ఇది చాలా కష్టం).
2. హైడ్ ఒప్పందంలోని ఏకపక్ష నియమాలకు తెరవేయటం.
3. మన పౌర, రక్షణకు సంభందించిన అణు పరిశొధనలపై నిర్ధిష్ట హామీని పొందటం.

5 comments:

Kathi Mahesh Kumar said...

ఈ విషయంపై నా అవగాహన శూన్యం. కాకపోతే మీరు కోరుకోదగిన సవరణలులో ఉటంకించిన మొదటి బిందువు అమలవ్వాలంటే NPT మీద మనం సంతకం చెయ్యడం తప్పనిసరి.రెండవ బిందువు వర్తించాలంటే మొత్తం హైడ్ నియమావళిని మనకోసం మార్చాలి. మూడవదానిలో అసలు ఆ "నిర్ధిష్టమైన" హామీలేమిటో తెలియాలి.

అమెరికా ఎప్పుడూ తమ స్వంత ప్రయోజనాల్నే ఆశిస్తుంది. అది భారతీయులకు వీసాలు ఎక్కువ మొత్తంలో ఇచ్చినా లేక భారతదేశంతో అణుఒప్పందం చేసుకున్నా అది వారి బలిమికే తప్ప మన మీద దయతోనో లేక ప్రేమతోనో కాదు.మనం మన అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని లాభనష్టాలు బేరీజు చెయ్యాలేగానీ, అమెరికా యొక్క (తెలియని) ఉద్దేశ్యాన్ని కాదు.

మన్మోహన్ సింగ్ ఆర్ధిక సంస్కరణలు తెచ్చినప్పుడుకూడా అతనికి రాజకీయపరిణితి లేదు, లేక అమెరికా పక్షపాతి అన్న వాదనలు వినిపించినవే కదా! ఇప్పుడు పరిస్థితేంటి? మూర్ఖపు పట్టువల్లనో లేక బుష్ మీద అవాజ్యమైన ప్రేమవల్లనో మన్మోహన్ గారు ఈ పనిచేస్తున్నారనడం కాస్త అసంబద్ధంగా ఉంది.

అణుఒప్పందం పూర్తి ముసాయిదా ఇప్పటివరకూ ప్రబుత్వాన్ని దించబూనుతున్న వామపక్షాలకూ, ప్రతిపక్షం కాబట్టి వారు మొదలెట్టిన ఈ ఒప్పందాన్ని వారే వ్యతిరేకిస్తున్న బి.జె.పి ఇరువురూ చదవలేదనేది సత్యం కాదా? మన్మోహన్ దేశ క్షణని దృష్టిలో ఉంచుకుని ఒప్పందాన్ని public చెయ్యలేక oath of secrecy ఆధారంగా కొందరు నేతలకి చూపించి చర్చ జరుపుతామంటే వీరు కనీసం అంగీకరించలేదే!! దేశం సార్వభౌమత్వం మీద వీరి చిత్తశుద్ది శంకించదగినది కాదంటారా?

Anil Dasari said...

అమెరికా వాళ్లు ఒప్పందంలో విషయాలు వాళ్ల దేశ జనాభా అందరికీ చూపించటానికి (సెనెట్, హౌస్ లలో చర్చ ద్వారా) రాని అడ్డం దేశ రక్షణ పేరుతో మనకి రావటం ఏమిటి? అయినా ఒప్పందం వివరాలు బయట పెట్టమంటున్నారే కానీ యురేనియం శుద్ధి రహస్యాలో మరోటో కాదు కదా.

పెదరాయ్డు said...

@ మహేష్:

1. ణ్ఫ్ట్ నిభందనల ప్రకారం 1962కు ముందు అణు పరీక్షలను జరిపిన దేశాలనే అణ్వస్త్ర దేశంగా గుర్థిస్తారు. మనం ప్రస్తుత రూపంలో ఆ ఒప్పందం పై సంతకం చేస్తే మనకు అణ్వస్త్ర దేశ హోదా లభించదు. అందుకే మనం సంతకం చేయలేదు. అందుకే ఈ నిభందనను సవరించటం కష్టమని టపా లో పేర్కొన్నాను.
2. హైడ్ ఒప్పందం భారత దేశం కోసం మాత్రమే రూపొందించబడింది. దీని అసలు మాత్రృక 123 ఒప్పందం.
3. నిర్ధిష్టమైన హామీ ఏంటంటే, మన పరిశోధనలకు అమెరికా ఊతమివ్వకపోయినా ఏ విధమైన ఆటంకాలు కల్పించకూడదని.

నేను ఇంతకు ముందే చెప్పినట్లు అమెరికా వాణిజ్య ప్రయోజనాలు మనకు పెద్ద నష్టాలు కావు. కనిపించని రాజకీయ లబ్దిని అంచనా వేయటమే మన నేతల నుంచి మనం ఆశించవలసింది. అన్ని కనిపిస్తున్నపుడు, నేను, మీరు కూడా ఆ ఒప్పందాన్ని అంగీకరించటానికి అర్హులమే.

ఆర్థికాంశాలలో మన్మోహన్ గారిని ప్రశ్నించేంత అవసరం లేదు. పైగా పి.వి గారు తోడున్నపుడు ఆ నిర్ణయాల రాజకీయ పరిణితికి అసలు సందేహం లేదు. కాంగ్రెస్ లో ప్రస్తుతమున్న నాయకత్వానికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిఙ్ఞానం(సోనియతో సహా) లేదు. అందుకే ప్రతిపక్షాల వాదనను వారు శక్తివంతంగా తిప్పికొట్ట లేక పోతున్నారు.

ఇక అణు ఒప్పందం రహస్య మన్న వాదనకు, ప్రణబ్ గారే ఒక రోజు (రాత్రి) తెరదించారు మనదేశంలో. అంతకు ముందే మిగిలిన వారు దానికి తెరలేపారు. :)
@ అబ్రకదబ్ర : ధన్యవాదాలు.

తెలుగు జాతి said...

1. అమెరికా ఏవిదంగా రాజకీయంగా లబ్దిపొంద గలదు? ఈ ఒప్పందంలో ఎక్కడయినా మనము అణు పరిశోధనలు పూర్తిగా నిలుపాలి అని ఎక్కడన్నా ఉన్నదా?

2. ఇకపోతె ఈ ఒప్పందానికి మరియు అన్వస్త్ర దేశంగా గుర్తించటానికి అసలు సంబందం లేదు ఆ విషయం గురించి మనము ఎప్పటి నుండో పోరుతున్నాము, ఈ ఒప్పందం జరగక పోయినా అన్వస్త్ర దేశంగా గుర్తింపు రాదు, దాని గురించి దీనికి సంబందం పెట్టరాదు.

3. ఇంకా చూడవలసినది, అమెరికా యొక్క ఏ ఒప్పందం ప్రకారం ఇరాక్ యుద్దం జరిగినది? అవసరమొస్తె ఎ ఒప్పందమయినా తుంగలో త్రొక్కవచ్చు, ఏ ఒప్పందం లేకున్నా అమెరికా ఆక్షలు విధించుటలేదా అణు పరిశొధన మీద, ఇప్పటికయినా ఈ ఒప్పందం గురించి అమెరికా ఒప్పుకున్నదంటె మనమంతా సంతొషించాలి, ఎందుకంటె మనమీద ఎంతో నమ్మకముండ బట్టి వాళ్ళయొక్క యురేనియం నిలువలని మనకు సరపరా చేస్తున్నారు, దీని గురించి మనము గర్వించాలి.

4. ఇంకా పోతె వాళ్ళు నిరంతరాయంగా సరఫరా చేస్తారని గ్యారంటి లేదు అనేది అది వారి సేఫ్టి గురించే కాని కొన్ని అనుకొని పరిస్థితులు ఎదురయినపుడు, వాళ్ళు సరఫరా చేయలేక పోతె మొత్తం డబ్బు తిరిగి మనకు ఇచ్చే ఒప్పందం ఉన్నది, దాని వళ్ళ మనకి వచ్చే నష్టం ఏమి లేదు.

పెదరాయ్డు said...

ఈ సమస్యని చాలా సమగ్రంగా వివరించిన టపాల లింకులు:

http://canopusconsulting.com/salabanjhikalu/?p=59
http://hridayam.wordpress.com/2008/07/21/n-deal/