Tuesday, August 5, 2008

గర్భస్థ శిశువును ఎప్పటిలోగా చంపవచ్చు?

చట్ట ప్రకారం కొన్ని కారణాలపై 20 వారాల వరకు. యధా ప్రకారం చట్టం ఎంత కట్టుదిట్టంగా వ్రాయబడినా/వ్రాయ దలచినా మన పండితులు దానిలో కనీసం లక్ష లొసుగులను పట్టుకోగలరు. ప్రస్తుతానికి మన చట్టం గురించి అందులోని లోపాలగురించి చర్చింటం ఇక్కడ వుద్దేశ్యం కాదు.

సృష్టిలో మానవ జీవితంకంటే సంక్లిష్టమైనది మరొక్కటి లేదని నేను భావిస్తాను. మన సిరివెన్నల గారన్నట్లు 'నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా'. ఒక మనిషి సృష్టి అమ్మ నాన్నల విచక్షణతో(కొన్ని సార్లు నిర్లక్ష్యంతో, ప్రమాదవశాత్తూ) ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. కొత్త ప్రపంచంలోకి అడుగిడటానికి నిరంతరం శ్రమిస్తూ, శ్రమ పెడుతూ ఎంతో అయోమయంతో ఎదురుచూస్తుంటుంది. ఇంతటి అయోమయంలోనూ వెచ్చటి అమ్మ కడుపులో భరోసాగా చిందులేస్తుంది. అంతటి భరోసాతో వున్నప్పుడు ఒకరోజు అమ్మ(అప్పటికి తనకు తెలిసిన మరో ప్రాణం) తనను చిదిమేస్తే విలవిలలాడుతూ తనకు తెలిసీ తెలియకనే (మళ్ళీ తన ప్రమేయం లేకనే) ప్రాణాలు విడుస్తుంది. ఇదే విధంగా సాగుతుందా ఆ చిన్నారి ప్రాణి ఆత్మఘోష?

అమ్మ విషయానికి వస్తే, తనలాంటి మరో ప్రాణికి జన్మనివ్వబోతున్నాననే ఉద్విఘ్నతతో ఈ ప్రపంచాన్నే మరచిపోయి ఆ శిశువుతో కబుర్లాడుతుంటుంది. తన రక్తం పంచుకుని ఎదుగుతున్న ఆ చిన్నారిపై కోటి ఆశలు పెట్టుకుంటుంది. ఆ శిశువు యొక్క ప్రతి అణువూ తనలో ఎదుగుతూ చేస్తున్న ప్రతి కదలికనూ తనివితీరా ఆస్వాదిస్తుంది. తనలోని మరో ప్రాణానికోసం తన ప్రాణమైనా ఫణంగా పెట్టడానికి సిద్దమవుతుంది. ఇటువంటి క్షణంలో ఆ బిడ్డ పుట్టిన తరువాత ఎదో లోపంతో వుంటాడని(సాధారణ జీవితం గడపలేదని) తెలిస్తే ఆ తల్లి హృదయఘోష ఏ దేవునికి అర్థమవుతుంది? లోపంతో వున్న బిడ్డకు జన్మానివ్వాలో కడుపులోనే కడతేర్చాలో నిర్ణయించుకోవలసి వస్తే, ఎంతటి దారుణమీ సృష్టి?

ఇక సమాజం(ప్రభుత్వంతో సహా) దేనిని సమర్థించాలి? శిశువు ప్రాణాన్నా? చంపాలనే అమ్మ కడుపుకోతనా? ఎపుడు సమర్థించాలి 20 వారాల ముందైతే ఫర్వాలేదా? తరువాతైతే నేరమా? ఎలా? అదేదో చానెల్ వారన్నట్లు మన దేశ పరిస్థితులను(వికలాంగులకు అనువైన పరిస్థితులు, సరైన సప్పొర్టు సిస్టం మనదేశంలో లేవట) దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలా? లేక ఎన్నికలు జరిపి ప్రజాభిప్రాయం ప్రకారం నడచుకోవాలా?

ఎందుకీ సృష్టి, ఎవరికోసం ఇలా జరుగుతోంది? కడుపులోని పిండం అరొగ్యాన్ని గుర్తించగలిగే మానవుని పరిఙ్ఞానికి సంతసించాలా? అదే మానవుడు తనకు కావలసిన పరామితులతో పిండాన్ని సృష్టించగలిగే పరిణామాలను ప్రోత్సహించాలా? అటువంటి పరిస్థితి వస్తే ఎనాటికైనా ప్రపంచంలోని ప్రతి మనిషీ(మర మనిషి!) ఒకే జన్యు సూత్రంతో ప్రయోగశాలల్లో పుడతాదేమో? అమ్మ, నాన్నల అవసరం వుండదేమో? మరి మానవ జీవిత వైవిధ్యం ఏమవుతుంది? వైవిధ్యం లేకపోతే ఏమవుతుంది? అపుడెందుకీ సృష్టి? ఎవరు చెప్పగలరీ ప్రశ్నలకు పరిష్కారాలు(సమాధానాలు కాదు)?

నాకు మతి భ్రమించిందంటారా? నిజమేనేమో!! భ్రమించకపోతే నేను మనిషిని కానేమో!!

6 comments:

రాధిక said...

ఇదేవిషయ0 పై మా కుటు0బ0 [కొ0చె0 దూరపు బ0ధ0] తర్జన భర్జన పడుతున్నారు.ఎక్కువ మ0ది చెప్పిన సలహా చ0పేయమనే.వినడానికి బాధగా వున్నా ఆలోచిస్తే నిజమే అనిపి0చెట0త రీజనబుల్.పుట్టిన పాప మానశిక0గా,శారీరక0గా ఎదగదు.అన్నీ మనమే చెయ్యాలి.ఎ0దుకు బ్రతుకుతున్నదో,ఏమి జరుగుతున్నాదో తెలియన0తగా వు0టు0ది అన్నప్పుడు అ0దరూ బాధపడినా చెప్పిన సలాహా చ0పేయమనే.నాకూ సబబు గానే అనిపి0చి0ది.నిజానికి ఇప్పుడు దూర0 చేసు0టే కలిగే బాధ ఎ0తోకాల0 ఉ0డదు,కానీ అలా ఎదగని పాపని చూస్తూ జనాలు చూపే జాలిని భరి0చలేక,ఆ పాపకి అన్ని చేయలేక ఆ ఇ0టిల్లిపాది జీవితా0త0 పడే బాధకన్నా ఇది చాలా నయమని నా ఉద్దేశ్య0. ఇలా0టి వాటిలో చట్టాలకన్నా మనుషుల అభిప్రాయలకు,వారి పరిస్థితికి తగట్టు ప్రవర్తిస్తే బాగు0టు0ది.అలా అని ఏ కాలో ,చెయ్యో లోప0 వు0దని పి0డాన్ని తు0చేయడ0...నేనస్సలు అ0గీకరి0చలేను.

Naga said...

మీకు మతి భ్రమించినట్లు అనిపించడం లేదు కానీ, మీరడిగిన ప్రశ్నలన్నింటికి ఎవరైనా సమాధానాలు రాయాలని ప్రయత్నిస్తే, మాత్రం వారికి మతి భ్రమించే అవకాశం ఉంది. భగవద్గీత పద్ధెనిమిది భాగాలు బోధించిన తరువాత కృష్ణుడు అర్జునుడితో నీ ఇచ్ఛ ప్రకారం చెయ్యమని వదిలేశాడు! :)

ఎవరి కర్మకు, నిర్ణయానికి వారిని వదిలెయ్యడం ద్వారా మనం అర్జెంటుగా మనశ్శాంతిని పొందవచ్చు.

పెదరాయ్డు said...

@రాధిక : నిజమే కొన్నిసార్లు హత్యలు కూడా మంచివే (సర్ఫ్ వారి మరక మంచిదే టైపులో). కాకపోతే ఇటువంటి నిర్ణయాలకు చాలా పరిణితి అవసరం.

@నాగన్న : హహహా, చాలా బాగా చెప్పారు..

Kathi Mahesh Kumar said...

చాలా క్లిష్టమైన ప్రశ్నలడుగుతున్నారు.వీటికి సమాధానం డాక్టర్లూ, కోర్టులూ ,మావహక్కులవాళ్ళూ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి వారిదగ్గరా సమాధానం లేనట్టుంది.

వికటకవి said...

క్షమించండి. టపా పేరు మార్చి, గర్భస్థ శిశువును........ అని చెప్పండి. లేకపోతే అర్ధాలు దారుణంగా మారిపోతాయి. అదీ టపా పేరులోనే ఉంది కాబట్టి.

పెదరాయ్డు said...

@ మహేష్: నిజమే. ఈ ప్రశ్నలకు సమాధానాలు కష్టమే. కాలమే ఈ సందేహాలను తీర్చగలదు.

@ వికటకవి: ఇది నా బుర్రకు తట్టనే లేదు. సవరించాను. ధన్యవాదాలు.